పంజాబ్ గురుదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబానానక్ నుంచి పాకిస్థాన్‌లో కర్తాపూర్ గురుద్వారా వరకు మొత్తం 4 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణానికి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ కారిడార్ మీదుగా వీసా లేకుండానే కర్తాపూర్ గురుద్వారాకు వెళ్లి ప్రార్థనలు చేసే అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కీలకమైన కర్తాపూర్ కారిడార్‌కు తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శంకుస్థాపన చేసి భారత్‌పై గూగ్లీని సంధించారని వ్యాఖ్యానించారు. అంతేకాదు సుష్మా స్వరాజ్‌పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ సుష్మాజీ ఈ వయసులో సిగ్గు పడుతున్నారని నేను చెప్పలేకపోతున్నా’ అని ఐరాసలో భేటీ రద్దును ఉద్దేశించి ఖురేషీ వివాదాస్ప వ్యాఖ్యలు చేసినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడిచేయనంత వరకూ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్చల ప్రసక్తే లేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేసిన మర్నాడే ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కర్తాపూర్ కారిడార్ శంకుస్థాపన కార్యక్రమానికి సుష్మాను పాక్ ఆహ్వానించింది. అయితే, అనివార్య కారణాల వల్ల తాను రాలేకపోతున్నానని సుష్మా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భారత్ తరఫున కేంద్ర మంత్రులు హరసిమ్రత్ కౌర్ బాదల్, హరిదీప్ సింగ్ పూరీలు హాజరయ్యారు. కార్తాపూర్ కారిడార్ గురించి అనేక ఏళ్లుగా భారత్ ప్రభుత్వం చేస్తున్న సూచనలకు అనుగుణంగా ఇమ్రాన్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దీనిని తమ ప్రధాని నెరవేర్చారని పాక్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ విసిరిన గూగ్లీకి భారత్ తన ఇద్దరు మంత్రులను పాకిస్థాన్‌కు పంపిందని ఖురేషీ రొచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థలకు పాక్ సహకరిస్తుందనే వాదనల్లో నిజం లేదని, తమతో కలవడానికి ఇష్టం లేకే భారత్ లేనిపోని ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. ఐరాస సాధారణ సభ సమావేశాల సందర్భంగా భారత్, పాక్ విదేశాంగ మంత్రులు మధ్య భేటీకి సుష్మా అంగీకరించారు. అయితే, ఇది జరిగిన కొద్ది సేపటికే జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు పోలీసులను పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు దారుణంగా హత్యచేశారు. 2016 జులైలో ఇండియన్ ముజాయిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని భారత సైన్యం హతమార్చగా, అతడి పేరుతో ఇమ్రాన్ ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేయడంతో భారత్ తన నిర్ణయాన్ని మార్చుకుని, పాక్ మంత్రితో సమావేశాన్ని రద్దుచేసుకుంది. భారతదేశంతో ఉద్రిక్తతలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు, కానీ ప్రజా కేంద్రీకృత, ప్రజా శ్రేయస్సు కోసం శాంతిని కోరుకోవడమే తమ విధానమని... ఇదే సమయంలో దేశం కూడా అభివృద్ధి చెందాలని భావిస్తున్నామని షా మహ్మద్ ఖురేషీ అన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కారిడార్‌కు శంకుస్థాపన చేయడంతో ఆయన పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.