రాజస్థాన్‌లో బీజేపీ అధికారం తిరిగి నిలబెట్టుకుంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆయన రాజస్థాన్‌లోని నాగౌర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టాలో ప్రజలే తేల్చుకోవాలని షా అన్నారు. దేశభక్తులైన మోదీ, వసుంధర రాజె ఉన్న భాజపాకు ఓటేస్తారో, సరైన విధానాలు, విలువలు లేని కాంగ్రెస్ ఓటేస్తారో నిర్ణయించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు సంస్థ లాంటిదని.. నెహ్రూ, గాంధీ కుటుంబాలే దానికి యజమానులని అమిత్ షా ఎద్దేవా చేశారు. దేశం జోలికి ఎవరొచ్చినా మోదీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. మన జవాన్లను చంపిన తీవ్రవాదులపై మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేయించి వారిని తుదముట్టించిన సంగతిని షా గుర్తుచేశారు. మహిళలకు గౌరవం కల్పించేందుకు రాజస్థాన్‌లో భాజపా ప్రభుత్వం 80లక్షల మరుగుదొడ్లు కట్టించిందని తెలిపారు. రాజస్థాన్‌లో భాజపా ప్రభుత్వం తిరిగి ఏర్పాటయ్యేందుకు నాగౌర్ నుంచి నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు. 200 నియోజకవర్గాలున్న రాజస్థాన్‌లో డిసెంబరు 7న పోలింగ్ జరగనుంది. 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి