YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశభద్రతకు కట్టుబడి ఉన్నాం : రాజ్ నాధ్

 దేశభద్రతకు కట్టుబడి ఉన్నాం : రాజ్ నాధ్
కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు పెట్టుకోవడం విడ్డూరం.. ఈ పొత్తును ప్రజలు విశ్వసించరంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. వాజ్‌పేయి ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోతుంటే.. తెలంగాణ, ఏపీ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నాయన్నారు. కేసీఆర్‌ అభివృద్ధి చేశామని చెప్తున్నారు.. మరి రాష్ట్రంలో 4,500 మంది ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలపాలని డిమాండ్‌ చేశారు. దేశంలో మతం పేరుతో ఓట్లు అడిగేవారిని తరిమి కొట్టాలని రాజ్‌నాథ్‌ పిలుపునిచ్చారు. బీజేపీ మానవత్వం పేరుతో మాత్రమే ఓట్లు అడుగుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ టీడీపీని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రారంభించారు. కానీ ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని.. బీజేపీని ఓడించడానికే పొత్తు పెట్టుకున్నామంటున్నారు. కానీ ఈ పొత్తును ప్రజలు విశ్వసించరని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ ఇక్కడ ఆలుగడ్డల ఫ్యాక్టరీ పెడతా అంటున్నారు.. ఇది దేశం పట్ల కాంగ్రెస్‌కున్న విజన్‌ ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం హన్మకొండ జే ఎన్‌ ఎస్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘మార్పు కోసం బీజేపీ’ బహిరంగ సభకు రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరగల్‌ చరిత్రాత్మక నగరం.. 1984లో బీజేపీకి మొదటి ఎంపీని అందించిన ఘనత జిల్లాదేనంటూ కొనియాడారు. అందుకే కేంద్రంలో అధికారంలోకి రాగానే స్మార్ట్‌ సిటీ, అమృత్‌ సిటీ, హెరిటేజ్‌ సిటీ పథకాలను జిల్లాకు అందించామని తెలిపారు. కేసీఆర్‌ జిల్లా వాసులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు, జర్నలిస్ట్‌లకు ఇళ్లు ఇస్తా అన్నారు.. కానీ ఒక్క హామీని కూడా నేరవేర్చలేదని ఆరోపించారు.దేశాన్ని అత్యధిక రోజులు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజల విశ్వసనీయత కోల్పొయిందన్నారు. బీజేపీ పార్టీ చెప్పింది చేస్తుంది.. అందుకే ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారని తెలిపారు. తాము ఒక్క సారి గెలిస్తే నీతి వంతమైన పాలన అందిస్తామని .. అందుకే ఏళ్ల తరబడి ప్రజలు తమకే పట్టం కడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో 4 లైన్ల, 6 లైన్ల జాతీయ, గ్రామీణ రహదారులు వాజ్‌పేయి హయాంలో వచ్చాయి.. వాటిని మోదీ కొనసాగిస్తున్నారని తెలిపారు. గుంతలమయమైన వరంగల్‌ రహదారులు చూస్తే.. కేసీఆర్‌ పాలన ఎలా ఉందో అర్థమవుతుందంటూ విమర్శించారు. మోదీ హాయంలో దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని.. ప్రపంచ టాప్‌ టెన్‌ దేశాల్లో భారత్‌ 6వ స్థానంలో ఉందని వివరించారు.బీజేపీ దేశ రక్షణ, ప్రజల రక్షణ కోసం కృషి చేస్తుందని తెలిపారు. పాక్‌ నుంచి ఒక్క బుల్లెట్‌ వస్తే.. ఇక్కడ నుంచి పంపే బుల్లెట్లను లెక్కించడం పాక్‌ వశం కాదని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో అందరికి ఆమోదయోగ్యమైన పథకాలను పెట్టామని తెలిపారు. కేసీఆర్‌ ఇక్కడి ప్రజలకు చైతన్యం రాలేదని అంటున్నారు.. మరి ఆయన్ను ముఖ్యమంత్రిని ఎలా చేశారని ప్రశ్నించారు. తన మిత్రుడు ధర్మరావును గెలిపించండని కోరారు. బీజేపీ అభ్యర్థులు గెలిచాక కృతజ్ఞతలు తెలపడానికి మళ్లీ వరంగల్‌ వస్తానని తెలిపారు.

Related Posts