మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. తెలంగాణ ఎన్నికలతో కాంగ్రెస్‌లో మళ్లీ యాక్టివ్‌గా మారారు. పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ దూకుడు పెంచారు. దీంతో కాంగ్రెస్ ఆయనకు తెలంగాణలో కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అజహరుద్దీన్‌తో పాటూ మరికొందరు నేతలకు కీలక బాధ్యత అప్పగించారు. అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో ఎంపీగా గెలిచారు. 2009 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి విజయం సాధించారు. 2014లో రాజస్థాన్‌లోని టోంక్ సవాయ్ మాదోపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ దూకుడు పెంచారు. అజర్ 2019లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో మరికొందరు నేతలకు కాంగ్రెస్ పదవులు కేటాయించింది. వైస్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ బీ.ఎం. వినోద్ కుమార్, జాఫర్ జావేద్‌లను నియమించారు. జనరల్ సెక్రటరీలుగా.. ఎస్. జగదీశ్వర్ రావు, నగేష్ ముదిరాజ్, టీ. నర్సారెడ్డి, మానవతా రాయ్, ఫాహీమ్, కైలాష్, లక్ష్మారెడ్డి, క్రిషాంక్‌లకు పదవులు ఇచ్చారు. దుర్గం భాస్కర్, దరువు ఎల్లన్న, విజయ్ కుమార్, బాల లక్ష్మీలను సెక్రెటరీలుగా నియమించారు.