ప్రభుత్వరంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందిన 3,000 పైచిలుకు కస్టమర్ సర్వీస్ సెంటర్లలో త్వరలో ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆయా సర్వీస్ సెంటర్ల ద్వారా ఆధార్ నమోదు, అప్‌డేషన్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన పరికరాలు మొదలైన వాటికి దాదాపు రూ.90 కోట్లు వ్యయం కానుందని, దీనికి యూఐడీఏఐ తోడ్పాటు అందించనుందని ఆయన వివరించారు. ఈ వ్యవస్థ ఏర్పాటుకు మూడు నెలలు పట్టొచ్చని శ్రీవాస్తవ చెప్పారు. త్వరలోనే పరికరాల కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభిస్తామని, జనవరి 1 నాటికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేషన్ సర్వీసులు అందించగలిగే తొలి సెంటర్ అందుబాటులోకి రాగలదని శ్రీవాస్తవ పేర్కొన్నారు. దీంతో ఆధార్ సర్వీసులు అందించే అధీకృత ఏజెన్సీల జాబితాలో బ్యాంకులు, పోస్టాఫీస్‌ల సరసన బీఎస్‌ఎన్‌ఎల్ కూడా చేరినట్లవుతుంది.