ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిన టీడీపీ నేత సుజనా చౌదరికి కాస్త ఊరట లభించింది. సోమవారం ఈడీ ముందు హాజరు కావాలని సుజనా చౌదరిని ఆదేశించిన హైకోర్టు.. ఆయనపై ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోరాదని ఈడీని శుక్రవారం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల కారణంగా ఈడీ ఆయన్ను అరెస్ట్ చేయడం కుదరదు. నవంబర్ 24, 27 తేదీల్లో ఢిల్లీ, హైదరాబాద్‌ల్లోని సుజనా గ్రూప్‌కు చెందిన 8 చోట్ల తనిఖీలు చేపట్టిన ఈడీ ఆరు లగ్జరీ కార్లను సీజ్ చేసింది. ఫెరారీ, రేంజ్ రోవర్, బెంజ్ తదితర లగ్జరీ కార్లు డమ్మీ కంపెనీల పేరిట రిజిస్టర్ అయినట్టు గుర్తించింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు తనను వేధిస్తోందని సుజన ఆరోపించారు. ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగాలు తన నివాసాల్లో సోదాలు జరిపాయన్నారు. తాను బ్యాంకులను రూ.5700 కోట్ల మేర మోసం చేశానని ఈడీ చేసిన ఆరోపణలు అవాస్తవామన్నారు.