YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఒక్క రూపాయి వదలొద్దు! ఎంపీ ల్యాడ్ నిధులపై ముఖ్యమంత్రి చంద్రబాబు

ఒక్క రూపాయి వదలొద్దు!  ఎంపీ ల్యాడ్ నిధులపై ముఖ్యమంత్రి చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన నిధులను ఎలాగూ ఇవ్వడం లేదని, చట్టబద్ధంగా మనకు దక్కే ఎంపీ ల్యాడ్ వంటి నిధులను అయినా సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సాధ్యమైనంతగా కేంద్రం నుంచి నిధులు రాష్ట్రానికి తెచ్చుకోవడమే అధికారులు, చట్టసభ సభ్యుల లక్ష్యం కావాలన్నారు. లోక్‌సభ సభ్యుల నిధులు రూ. 417కోట్లు మాత్రమే ఇప్పటివరకు విడుదలయ్యాయని, ఇంకా రూ. 207కోట్లు రావాల్సి ఉందన్నారు. అలాగే రాజ్యసభ సభ్యుల నిధులు రూ. 70 కోట్లు విడుదల కాగా, మరో రూ. 50 కోట్లు సద్వినియోగం చేసుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.  
ప్రజా పంపిణీ వ్యవస్థలో సంతృప్తి లక్ష్యం 90%
చౌకడిపోల్లో వినియోగదారులు చైతన్యంగా ఉండాలన్న ముఖ్యమంత్రి రేషన్ తీసుకోగానే తూకం సరిచూసుకోవాలి, డీలర్ నుంచి రశీదు పొందాలనే సందేశంపై మరింత ప్రచారం కల్పించాలన్నారు. రేషన్ పంపిణీపై వచ్చే నెలకు ప్రజల్లో సంతృప్తి మరో 5 శాతం పెరగాలని సూచించారు. రాబోయే రెండు నెలల్లో రేషన్‌పై సంతృప్తి 90 శాతానికి చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రాగి, జొన్న వంటి చిరుధాన్యాల పంపిణీని ప్రోత్సహించాలని, కర్నూలు జిల్లాలో ఇందుకు మంచి స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. ఏ సంక్షేమ పథకం అయినా క్షేత్రస్థాయి తనిఖీ తర్వాతే లబ్దిదారుల ఎంపిక జరగాలన్నారు. అర్హులకే ప్రభుత్వ పథకాలు చెందాలని, ఏ ఒక్క అనర్హుడికి ఇచ్చినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. 
‘ఎన్టీఆర్ భరోసా’ సంతృప్తి లక్ష్యం 95%
ఎన్టీఆర్ భరోసా కింద నెలనెలా 50,28,895 పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకోసం ప్రతినెలా రూ.552.77 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ ముఖ్యమంత్రి వివరించారు. డప్పు ఆర్టిస్టులకు పింఛన్లు ఇచ్చే అంశంపై త్వరలో జీవో తీసుకువస్తున్నామని, అలాగే వృద్ధాప్య పింఛన్లు అందజేతలో గిరిజనుల అర్హత వయసును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించే అంశంపై ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. పించన్లపై ప్రస్తుతం లబ్దిదారుల్లో 83.4% సంతృప్తి ఉందని, దీనిని వచ్చేనెలకు మరో 5% పెంచాలని, రాబోయే రెండు నెలల్లో 95 శాతానికి సంతృప్తి రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. 
‘చంద్రన్న బీమా’ సంతృప్తి లక్ష్యం 100%
అటు చంద్రన్న బీమాపై ప్రజల్లో సంతృప్తి 95 శాతం ఉందని, విశాఖ, గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరంలో 98 శాతం సంతృప్తి వచ్చిందన్న ముఖ్యమంత్రి, అన్ని జిల్లాల్లోనూ చంద్రన్న బీమాపై నూరు శాతం సంతృప్తి రావాలని చెప్పారు. చంద్రన్న బీమా పథకంలో బీమా సంస్థల అధికారులు లంచం అడుగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, వాటిపై చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత నాలుగున్నరేళ్లుగా సాంకేతిక సాయంతో రాష్ట్రంలో అవినీతి అనేది లేకుండా చేశామని ముఖ్యమంత్రి అన్నారు. అవినీతి రహిత రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉందనే విషయం ఇటీవల సర్వేలో వెల్లడైందని, మొదటి స్థానం మన లక్ష్యం కావాలన్నారు. పేదలకు అందించే సంక్షేమ పథకాలలో పైసా అవినీతి కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
‘చంద్రన్న పెళ్లికానుక’ సంతృప్తి లక్ష్యం 100%
‘చంద్రన్న పెళ్లికానుక’పై ప్రజల్లో సంతృప్తి అక్టోబర్‌లో 97.69% ఉండగా, నవంబర్‌లో 97.82% పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ ప్రతినిధిగా కల్యాణమిత్ర కచ్చితంగా పెళ్లిళ్లకు హాజరుకావాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 555 కేంద్రాలు, కళాశాలల్లో ఎంప్లాయిబిలిటి స్కిల్స్ ఎన్‌హాన్స్‌మెంట్ మాడ్యూల్(ఈఎస్‌ఈఎం) తీసుకువస్తున్నామని, డిసెంబర్ 10 నుంచి మార్చి వరకు ఈఎస్ఈఎం శిక్షణ తరగతులు ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉపాధి శిక్షణలో దేశంలో మనమే ముందుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. మన యువత నైపుణ్యాలే భవిష్యత్ సంపదగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువతీయువకులు అందరికీ నైపుణ్యాలు పెంచాలన్నారు. సామర్ధ్యం పెంపుతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా ఉండాలని చెప్పారు. సంపద సృష్టికి ‘యువనేస్తం’ పథకం వినియోగపడాలని ముఖ్యమంత్రి అన్నారు. యువత ఖాళీగా ఉండకూడదని, స్తబ్ధత రాకూడదని అన్నారు. ఇన్నోవేటివ్ హబ్ ఏర్పాటు చేసి కళాశాలలకు, పరిశ్రమలకు, ఐటి కంపెనీలకు అనుసంధానం చేయాలన్నారు. ప్రతినెలా ఉపాధి శిక్షణ వర్క్‌షాప్‌లు నిర్వహించాలన్నారు. ఎంతమందికి ఎక్కడెక్కడ ఉపాధి లభించిందనే వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. 

Related Posts