పోలింగ్‌లో ఆధునిక టెక్నాలజీ వినియోగంలోకి రావడంతో లాభంతో పాటు నష్టంకూడా జరుగుతోంది. పోలింగ్ వేగంగా జరిగేందుకు ఈవీఎంలను వినియోగిస్తుండటంతో ఏ పోలింగ్ కేంద్రంలో ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో వెల్లడి అవుతుందో వెల్లడవుతోంది. గెలిచిన ఎమ్మెల్యే ఆ తర్వాత తనకు ఓట్లు రాని ప్రాంతాలపై ద్వేషం, కక్ష పెంచుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి తనకు ఓట్లు రాని గ్రామాలు/ప్రాంతాలపై నిర్లక్ష్యం చూపే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈవీఎంలను వినియోగిస్తుండటంతో పోలింగ్ రహస్యంగా జరిగినా, ఏ ఓటరు ఎవరికి ఓటు వేశారో తెలియకపోయినా, ఒక పోలింగ్ కేంద్రంలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలిసిపోతోంది. బ్యాలెట్ పేపర్ విధానం అమల్లో ఉన్న సమయంలో రహస్యం ఉండేది. అన్ని గ్రామాల నుండి కౌంటింగ్ కేంద్రానికి వచ్చే బ్యాలెట్ బాక్స్‌లను విప్పి అసెంబ్లీ నియోజకవర్గం వారీగా మొత్తం ఓట్లను కలిపివేసేవారు. తర్వాత కౌంటింగ్ చేసే వారు. ఈ విధానంలో ఏ గ్రామంలో, ఏ వార్డుల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలిసేది కాదు, రహస్యం ఉండేది. ఈవీఎంల రాకతో ఈ రహస్యం పోయింది.ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 100 గ్రామాల వరకు ఉంటాయి. అంటే ప్రతి గ్రామంలో రెండు లేదా మూడు ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ యా గ్రామాల్లో ఉన్న వార్డులను, ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఎన్ని ఈవీఎంలను ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తారు. సుమారు 900 ఓట్ల వరకు ఒక ఈవీఎంను ఏర్పాటు చేస్తున్నారు. ఒక గ్రామంలో 2500 మంది ఓటర్లు ఉంటే మూడు ఈవీఎలను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంల వారీగా కౌంటింగ్ జరుగుతుండటంతో ఏ వార్డుల్లో, ఏ గ్రామంలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో కౌంటింగ్ సందర్భంగా తెలిసిపోతుంది.పోలింగ్ వేగంగా జరిగేందుకు ఈవీఎం (ఎలక్రానిక్ ఓటింగ్ మిషన్లు) లను వినియోగిస్తున్నారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్‌లను ఏర్పాటు చేస్తుండటంతో అభ్యర్థి తన ఓటు ఎవరికి పడ్డదో రూఢీ చేసుకునేందుకు వీవీప్యాట్‌ల వల్ల వీలుకలిగింది. గ్రామాల వారీగా, ఈవీఎం వారీగా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో ఈవీఎంల వినియోగంతో వెల్లడవుతోంది. బ్యాలెట్‌పేపర్ల వినియోగంలో ఉన్న సమయంలో వార్డులవారీగా, గ్రామాల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలిసేది కాదు.రాష్ట్రం మొత్తంలో 12 వేలపైగా రెవెన్యూ గ్రామాలు ఉండగా, 32,796 ఈవీఎంలను వాడాలని తొలుత భావించారు. ఎన్ని ఈవీఎంలను ఉపయోగిస్తున్నారన్న విషయం కంటే కౌంటింగ్‌లో గ్రామాలవారీగా రహస్యం ఉంటే బాగుంటుందని ఓటర్లు, న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉపయోగించే ఈవీఎంలన్నింటినీ అనుసంధానం చేసి ఓట్లు లెక్కించేలా టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.