YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పశ్చిమ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్

 పశ్చిమ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్
పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టే ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఇక్కడ ప్రజలు మాత్రం టీడీపీనే నమ్ముతారు. అది ఉమ్మడి ఏపీలో కానీయండి.. విభజిత ఏపీలో కానీయండి.. ఎప్పుడైనా ఇక్కడ ఓటర్లు మాత్రం సదా టీడీపీతోనే ఉన్నారు. అటువంటి పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి కొంచెం టెన్షన్ మొదలైంది. ఇప్పటివరకు నియోజకవర్గాలను పెద్దగా పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ఇదే తరుణంలో వారికి పార్టీ పెద్దల నుంచి ఓ సందేశం అందిందట. దాంతో వారి టెన్షన్‌ రెట్టింపు అయ్యిందట! ఇంతకీ వారికి అందిన సందేశం ఏంటి? వారి ఆందోళన ఎందుకు పెరిగింది?పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ మాటని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే వల్లెవేస్తుంటారు కూడా! ఆయన సంగతేమో కానీ, జిల్లావాసులు మాత్రం ఎప్పుడూ ఆ పార్టీతోనే ఉంటారన్న నానుడి ఉంది.ఉమ్మడి ఏపీలో ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, పశ్చిమ ఓటర్లు మాత్రం జిల్లాలోని సగం అసెంబ్లీ సీట్లను టీడీపీకే కట్టబెట్టిన సందర్భాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అయితే పరిస్థితి చెప్పనక్కర లేదు. 2014 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న మొత్తం పదిహేను సీట్లలో పద్నాలుగు సీట్లు టీడీపీకే దక్కాయి. మిగిలిన ఒక్క నియోజకవర్గంలోనూ అప్పటి మిత్రపక్షమైన బీజేపీ పాగావేసింది. అంటే మొత్తం అన్ని స్ధానాల్లోనూ టీడీపీ గాలే వీచిందన్న మాట! అలాంటి కంచుకోటలో టీడీపీ సిట్టింగులకు ఇప్పుడు కొత్త బెంగ పట్టుకుందట. అది కూడా కొన్ని నెలల క్రితం నుంచే మొదలైందట! పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేది లేదని టీడీపీ హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందట! ఈ నేపథ్యంలో ప్రస్తుత సిట్టింగుల పనితీరును అంచనా వేస్తే కనీసం అయిదు లేక ఆరుగురికి టిక్కెట్ రావడం కష్టమేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు- ఎవరెవరికి టిక్కెట్లు వస్తాయి, ఎవరికి రావు అనే అంశంపై కూడా గుసగుసలు వినిపిస్తున్నాయట! పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన కొవ్వూరు, ఆచంటల ఎమ్మెల్యేలు జవహర్, పితాని సత్యనారాయణ ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్‌లో ఉన్నారు. తాడేపల్లిగూడేనికి బీజేపీకి చెందిన మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గూడెం నుంచి కూడా టీడీపీ అభ్యర్ధిని నిలబెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే టీడీపీ, బీజేపీల మధ్య ఇప్పుడు వాతావరణం ఉప్పు- నిప్పులా ఉంది కాబట్టి! ఆ నియోజకవర్గాన్ని పక్కనపెడితే, మిగిలిన పద్నాలుగు స్థానాల్లో సిట్టింగుల పనితీరుపై హైకమాండ్ మంత్లీ సర్వేలు, ఇయర్ వైజ్ సర్వేలు చేపడుతూ వచ్చింది. ఈ సర్వేలు ఇంకా కొనసాగుతున్నాయనుకోండి- అది వేరే విషయం. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి ఎలా తీసుకువెళుతున్నారు? అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలుచేస్తున్నారు? అన్న అంశాలపైనే ప్రధానంగా నెలవారీ సర్వేలు కొనసాగాయి.

Related Posts