విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేట్ (పీపీపీ) విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. ఆసక్తి వ్యక్తీకరణలో ఎంపికైన సంస్థల నుంచి ఇప్పుడు టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానించేందుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ)కు ప్రభుత్వం అనుమతించింది.విశాఖ మెట్రో రైల్‌ను మూడు కారిడార్లలో మొత్తం 42.55 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. మొత్తం 38 స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం 83 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 12 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరించి కేటాయించనున్నారు. డెవలపర్‌కు పదేళ్ల కాలానికి నిర్వహణకు రూ. 820 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టుకు ఎస్‌జీఎస్‌టీ కింద రూ. 527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం డెవలపర్‌కు రీయింబర్స్‌మెంట్ చేయనుంది. ఈ ప్రాజెకుకు సంబంధించి ఇప్పటికే అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించగా.. వచ్చిన దరఖాస్తుల్లో ఐదు సంస్థలను ఎంపిక చేసింది. వీటిల్లో అదానీ ఎంటర్ ప్రైజెస్, ట్రైల్ (టాటా)ప్రాజెక్టు, షాపూర్‌జీ పల్లోంజీ, ఎస్సెల్ ఇన్ ఫ్రా, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌ల ఉన్నాయి. ఈ ఐదు సంస్థల నుంచి బిడ్లు దాఖలు ప్రతిపాదనలను, రాయితీ ఒప్పంద పత్రాలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం అనుమతించింది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ. 4,200 కోట్ల రుణం మంజూరు చేసేందుకు కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు ముందుకు వచ్చింది. విశాఖ మెట్రో రైలు నిర్మాణ వ్యయం రూ. 8,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ వ్యయాన్ని రెండు విభాగాలుగా విభజించారు. సివిల్ నిర్మాణాల వ్యయం 51 శాతం వాటాగా రూ. 4,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఎలక్ట్రో మెకానికల్ పనుల వ్యయం 49 శాతం వాటాగా రూ. 4,100 కోట్లను డెవలపర్ భరించాల్సి ఉంది. వినూత్న పీపీపీ పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పు చేస్తుంది. ఈ అప్పును తీర్చేందుకు మెట్రో ప్రాజెక్టుకు సమీపంలో 250 ఎకరాలను రియల్ ఎస్టేట్‌కు ఇవ్వనుంది. ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయం నుంచి అప్పు, వడ్డీ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.మెట్రో రైలు నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న అప్పును తీర్చేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 250 ఎకరాలను ఉచితంగా ఏఎంఆర్‌సీ కేటాయిస్తుంది. ఆ 250 ఎకరాలను ఏడాదికి ఎకరానికి రూ. 100 లీజుపైన రియల్ ఎస్టేట్‌కు ఇస్తుంది. ప్రతీ ఏడాది లీజును ఐదు శాతం పెంచనున్నారు. ఈ 250 ఎకరాలను 60 సంవత్సరాల పాటు లీజుకు నిర్మాణ సంస్థకు ఇవ్వనున్నారు. ఈ భూమిలో రియల్ ఎసేŠట్‌ట్, రెసిడెన్షియల్, ఇండస్ట్రీస్, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తారు. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేస్తారు. 250 ఎకరాల్లో వచ్చే ఆదాయంలో 75 శాతం నిర్మాణ సంస్థకు పోగా 25 శాతం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌కు వస్తుంది. 250 ఎకరాల్లో నిర్మాణాల వ్యయాన్ని డెవలపర్ భరించాలి. పది సంవత్సరాల్లో 250 ఎకరాల్లో నిర్మాణాలకు రూ. 4,350 కోట్లు అవుతుందని అంచనా వేశారు.డెవలపర్‌కు చెందిన 75 శాతం వాటాకు వచ్చిన భవనాలను, సూపర్ స్ట్రక్చర్స్‌ను ఇతరులెవ్వరికైనా ఇచ్చేసేందుకు, టైటిల్‌ను బదిలీ చేసేందుకు అనుమతిస్తారు. ఏఎంఆర్‌సీకి రానున్న 25 శాతం రెవెన్యూ వాటా చెల్లించడానికి డెవలపర్ ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాను తెరవాలి. మైట్రో రైలు నిర్వహణలో లోటు ఏర్పడితే ఈ ఎస్క్రో అకౌంట్ నుంచి ఏఎంఆర్‌సీ చెల్లిస్తుంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ద్వారా ఏఎంఆర్‌సీకి వచ్చే ఆదాయం నుంచి విదేశీ సంస్థ నుంచి తీసుకుంటున్న అప్పు, వడ్డీని చెల్లించనున్నారు. 250 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా 30 సంవత్సరాల్లో డెవలపర్‌కు రూ. 15,692 కోట్ల ఆదాయం, అలాగే ఏఎంఆర్‌సీకి రూ. 7,066 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్లు మెట్రో ప్రాజెక్టును పట్టించుకోకుండా ఇపుడు మరో నాలుగు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా హడావుడి చేయడం చేయడం ఎన్నికల జిమ్మిక్కేనని విశాఖ ప్రజలు మండిపడుతున్నారు.