ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు శనివారం జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రావెలకు పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్, పసుపులేటి బాలరాజు పాల్గొన్నారు. తెలుగు దేశంలో తనకు తగిన గౌరవం లభించడం లేదని కినక వహించిన రావెల ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేసారు. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై అయన గెలుపొందారు. తరువాత చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2017, మార్చిలో జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం చంద్రబాబు ఆయనకు ఉద్వాసన పలికారు. అంతేకాకుండా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పలు విషయాల్లో రావెలకు విభేదాలు తలెత్తాయి. దీంతో అయన టీడీపీకి రాజీనామా చేసారు. రావెల కిషోర్ మాట్లాడుతూ రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. డబ్బు, సారాకు ఓట్లను దోచుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. సమసమాజాన్ని నిర్మించేందుకు పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. కోట్ల సంపాదనను వదులుకుని పవన్ ప్రజాసేవకు అంకితం కావడం సంతోషకరమన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని తాను టీడీపీలో ఉండలేక పోయానన్నారు. ఆత్మగౌరవాన్ని రక్షించుకోకపోతే జాతిమనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. టీడీపీలో పదవులు ఇస్తారు కానీ… అధికారం ఇవ్వరన్నారు. పవన్ సారథ్యంలో సమసమాజ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని రావెల అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రావెల కిషోర్బాబు జనసేనలో చేరడం సంతోషకరమని అన్నారు. అవకాశవాద రాజకీయాలు కాకుండా ప్రజలకు సేవచేసే రాజకీయాలు రావాలన్నారు. కులరాజకీయాలు వస్తే సుఖశాంతులు, అభివృద్ధి ఉండదన్నారు. కొన్ని కుటుంబాల చేతిలో అధికారం ఉండటం రాష్ట్రానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు.