YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చివరి ప్రయత్నాల్లో కమలం పార్టీ

చివరి ప్రయత్నాల్లో కమలం పార్టీ
రాజస్థాన్ ఎన్నికలు ఎన్నడూ లేనంత ఉత్కంఠను రేపుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ రెండు ప్రధాన పార్టీలైన భారతీయజనతా పార్టీ, కాంగ్రెస్ లు అన్ని వ్యూహాలను పక్కాగా అమలు చేస్తున్నాయి. రాజస్థాన్ లో గెలుపు కాంగ్రెస్ దేనంటూ అనేక సర్వే సంస్థలు వెల్లడించడంతో హస్తం పార్టీ ఖచ్చితంగా గెలుపు తమదేనన్న ధీమాతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ కూడా ఆశలు లేకున్నా పట్టును ఏమాత్రం వదలడం లేదు. ఎన్నిరకాల వ్యూహాలను అమలు పర్చాలో అన్ని రకాలుగా రాజస్థాన్ లో అమలు పరుస్తోంది. ముఖ్యంగా అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలు ప్రత్యేక వ్యూహరచనను రాజస్థాన్ లో అమలు చేస్తున్నారు. రెండు పార్టీలూ గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్ లో ఎలాగైనా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుందేకు చెమటోడుస్తున్నారు. ముందుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తీసుకుంటే పూర్తి సర్వేల ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపును ఇరు పార్టీలూ చేశాయనే చెప్పొచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకపవనాలు వీస్తున్నాయని తెలియడంతో ఏ మాత్రం సంకోచించకుండా అభ్యర్థులను మార్చేశారు. గత ఎన్నికల్లో రాజస్థాన్ల బీజేపీ 163 అసెంబ్లీ స్థానాలను సాధించింది.ఇందులో కేవలం 29 మంది సిట్టింగ్ లకు మాత్రమే చోటిచ్చారు.దాదాపు 134 మంది సిట్టింగ్ లకు ఈసారి అవకాశం ఇవ్వకపోవడం విశేషం. ఇలా బీజేపీ అభ్యర్థులను మార్చి ఓటమి నుంచి తప్పించుకోవాలని భావిస్తోంది.ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వారికి సీట్లు కేటాయించింది. గత ఎన్నికలలో ఓడిపోయిన వారికి సానుభూతి ఉంటుందన్న అంచనాతోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు జస్వంత్ సింగ్ కుమారుడు మాన్వేంద్ర సింగ్ కు ఝాత్రా పాటర్ నియోజకవర్గం కేటాయించింది. ఇక్కడ ముఖ్యమంత్రి వసుంధరరాజే పోటీ చేస్తుండటం విశేషం. వసుంధరను కట్టడి చేయడానికే మాన్వేంద్ర సింగ్ ను ఇక్కడి నుంచి బరిలోకి దించింది.వసుంధర పై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో భారతీయ జనతా పార్టీ కొత్త వ్యూహాలను అమల్లోకి తెస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చివరిగా జరుగుతున్న రాజస్థాన్ లో చివరినిమిషంలో సీన్ మార్చేందుకు అమిత్ షా, మోదీలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. కులం కార్డును ఉపయోగించడంతో పాటు అయోధ్య అంశం కూడా తమకు కలసి వస్తుందని బీజేపీ భావిస్తుంది. అందుకే విశ్వహిందూ పరిషత్ చేత అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతామని ప్రకటన వచ్చిందంటున్నారు. దీని ప్రభావంతో ఎక్కువగా హిందూ ఓటర్లను తమవైపు తిప్పుకునే వీలుంటుందని కమలనాధులు అంచనా వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ వ్యూహాలతో అప్రమత్తమయింది. మరి చివరి నిమిషంలో మో…షా….లు సీన్ మారుస్తారో? లేదో? చూడాల్సి ఉంది.

Related Posts