అత్యవసర పరిస్థితుల్లో అవయవాలను ఓ ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలించేందుకు త్వరలోనే డ్రోన్లు అందుబాటులోకి రానున్నాయి. భారతీయ నగరాల్లో పెరిగిపోతున్న ట్రాఫిక్ నేపథ్యంలో ప్రస్తుతం అవయవాలను త్వరితగతిన తరలించడానికి రహదారులను ఖాళీ చేయించడం లేదా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయడం వంటివి చేయాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందుల్లేకుండా డ్రోన్ల ద్వారా తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వెల్లడించారు. ఇందుకోసం ఆసుపత్రుల్లో ‘డ్రోన్ పోర్టు’లను ఏర్పాటు చేయించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు భారత్‌లో డ్రోన్లకు చట్టబద్ధ హోదా ఇచ్చేందుకు లైసెన్సులు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం శనివారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ బుల్లి లోహ విహంగాల కోసం కేంద్రం ఈ ఏడాది ఆగస్టులో డ్రోన్ 1.0 విధానాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. అది ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. తర్వాతి దశ కోసం డ్రోన్ 2.0 విధానంపై తాము కసరత్తు మొదలుపెట్టినట్లు సిన్హా చెప్పారు.ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసే డ్రోన్‌పోర్టుల వల్ల.. దాత నుంచి సేకరించిన అవయవాలను వేగంగా గ్రహీత వద్దకు చేరవేయడానికి వీలవుతుందన్నారు. ఈమేరకు రూపొందే ముసాయిదాను జనవరి 15న ముంబయిలో నిర్వహించే ప్రపంచ విమానయాన సదస్సులో పరిశీలనకు సమర్పించనున్నట్లు తెలిపారు. డ్రోన్ల వినియోగం కోసం ప్రత్యేక డిజిటల్ వాయు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. తదుపరి దశలో..డ్రోన్‌విధానంలో పెను మార్పులు తీసుకురానున్నట్లు మంత్రి చెప్పారు.