బాహుబలి’ సీరిస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. సినిమా విడుదలై సుమారు ఏడాది కావస్తున్నా.. ఇంకా ఆ సినిమాకు లభించిన క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా లండన్‌లో ప్రఖ్యాతిగాంచిన ‘రాయల్ అల్బర్ట్ హాల్’లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. అయితే, ఇది సాధారణ ప్రదర్శన కాదు. ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. ‘బాహుబలి - ద బిగినింగ్’ సినిమాకు సంబంధించిన సంగీతం మొత్తం ఇక్కడ ఆర్కెస్ట్రా ద్వారా లైవ్‌లో వినిపిస్తారు. అంటే, అక్కడ సినిమా ప్రదర్శన జరుగుతుండగానే సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సమకూర్చిన బాణీలను సింఫనీ ఆర్కెస్ట్రాపై వినిపిస్తారు. హిందీ డబ్బింగ్ సినిమాను ఇంగ్లీష్ సబ్టైటిళ్లతో ప్రదర్శిస్తారు. లండన్‌లో ప్రఖ్యాతగాంచిన రాయల్ ఫిల్హార్మానిక్ కన్సర్ట్ ఆర్కెస్ట్రా నిర్వాహకుడు లుడ్విగ్ వికీ తమ వెబ్సైట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. రాయల్ అల్బర్ హాల్ కూడా ఈ సినిమా షెడ్యూల్‌ను ట్వీట్ చేసింది. ‘బాహుబలి’ దర్శకుడు దీన్ని రీట్వీట్ చేశారు. ‘‘గతేడాది నేను రాయల్ అల్బెర్ట్ హాల్‌కు వెళ్లాను. ఇక్కడ ‘బాహుబలి’ సౌండ్ ట్రాక్‌ను ప్లే చేస్తే ఎంత గొప్పగా ఉంటుందనే విషయంపై వారితో చర్చించాను. ఈ సందర్భంగా ఎవరో ‘తదాస్థు’ అని ఆశీర్వదించినట్లున్నారు. వెయిటింగ్..’’ అంటూ ఈ విషయాన్ని రాజమౌళి తన అభిమానులతో పంచుకున్నారు.