ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులన్నీ అనకాపల్లిలోనే జరుగుతాయి. నాడు అధికార కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించిన సభకు వేదిక అనకాపల్లి కావడం విశేషం. అప్పట్లో విశాఖ జిల్లాలో వైఎస్ మిత్రునిగా ఉన్న ద్రోణం రాజు సత్యనారాయణ పర్యవేక్షణలో ఆ మీటింగ్ సూపర్ హిట్ అయి ఏపీ రాజకీయాలను మలుపు తిప్పింది. ఆ తరువాత అప్పటి కాంగ్రెస్ సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి రాజీనామా చేయడం కూడా జరిగింది.ప్రతిపక్ష రాజకీయాలకు ఆలవాలంగా అనకాపల్లి నిలుస్తూ వస్తోంది. . ఎమర్జెన్సీ టైంలో జనతా పార్టీ నాయకుల మీటింగులు, ఆ తరువాత బీజేపీ ఆవిర్భావం తరువాత వారి మీటింగులు, టీడీపీ పెట్టాక అన్న నందమూరి తారకరామారావు మీటింగులు అనకాపల్లి గ్రౌండ్లో జరిగి హోరెత్తించాయి. మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు తనయుడు అమరనాధ్ నాయకత్వంలో వైసీపీ డిసెంబర్ 23న ఓ భారీ మీటింగును అనకాపల్లి వేదికగా నిర్వహిస్తోంది. డిసెంబర్ 23.. అనకాపల్లి చూడు పేరు మీద జరిగే ఈ సభ జిల్లా రాజకీయాలను మలుపు తిప్పుతాయని అంటున్నారు. ఈ సభకు వైసీపీ నుంచి కీలకమైన నాయకులంతా వస్తున్నారు. విశాఖ రూరల్ జిల్లలో ఎనిమిది అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి. రేపటి ఎన్నికల్లో వాటిని గెలుచుకోవడమే టార్గెట్ గా వైసీపీ భారీ ఎత్తున ఈ మీటింగు నిర్వహిస్తోంది.ఇదిలా ఉండగా 2014 ఎన్నికల్లో వైసీపీకి విశాఖ, అర్బన్ రూరల్ జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఏజెన్సీ లో మాత్రం ఉన్న రెండు సీట్లు వైసీపీ గెలుచుకుంది. రెండు నెలల క్రితం విశాఖ జిల్లాలో జరిగిన జగన్ పాదయాత్ర విజయవంతం కావడంతో వైసీపీ విజయావకాశాలపై ధీమా పెరిగింది. దాంతో ఇక్కడ గరిష్టంగా సీట్లను గెలుచుకోవాలని పార్టీ డిసైడ్ అయింది. అనకాపల్లి నుంచి అమరనాధ్ పోటీ చేస్తూండగా, ఎలమంచిలి నుంచి మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు రంగంలో ఉన్నారు. చోడవరం నుంచి మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ మాడుగుల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు బరిలో ఉన్నారు.నర్శీపట్నం, పాయకరావుపేటలలో కూడా పార్టీ గెలుపు అవకాశాలు మెరుగు అయ్యాయంటున్నారు. అందువల్ల ఎన్నికల కంటే ముందు భారీ మీటింగ్ నిర్వహించి క్యాడర్ ని పరుగులు పెట్టించడంతో పాటు, సత్తా చాటేందుకు వైసీపీ ఈ మీటింగుని ఏర్పాటు చేస్తోంది. ఈ సభతో పార్టీలో ఉత్సాహం ఉరకలెత్తించి ఎన్నికలకు వెళ్ళేలా వైసీపీ వ్యూహరచన చేస్తోంది. జిల్లా రాజకీయాల్లో ఈ సభ ఎటువంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి