ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న ఆయన.. యువకులతో పోటీ పడేలా రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. అలాగే పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లోపే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో అక్కడి బాధ్యతలను కూడా స్వయంగా చూసుకుంటున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న 13 మంది అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారాయన. బుధవారం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సనత్‌నగర్, నాంపల్లి నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం, రాత్రి ఏర్పాటు చేసిన రోడ్‌షోలకు హాజరయ్యారు. తాజాగా శనివారం హైదరాబాద్‌లో రాజేంద్రనగర్, కూకట్‌పల్లిలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఎన్నికల ప్రచారం కూటమి అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఖమ్మం బహిరంగ సభ మొదలుకుని, ఆదివారం జరిగిన పర్యటన వరకు చంద్రబాబు ఒకే పంథాను ఫాలో అయ్యారు. ఒకవైపు తాను నగరానికి చేసిన అభివృద్ధి గురించి చెబుతూనే, కేసీఆర్ తనపై చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. అలాగే మధ్య మధ్యలో అక్కడున్న టీడీపీ కార్యకర్తలకు ప్రశ్నలు వేస్తూ వారితోనే సమాధానాలు చెప్పిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలలో ‘‘హైదరాబాద్ నేను కట్టానని చెప్పానా..? చార్మినార్ నేను కట్టానని చెప్పానా..? ఏంతమ్ముళ్లు మీరు చెప్పండి… నేను ఎప్పుడైనా అలా మాట్లాడానా?’’ అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు. అలాగే ‘‘సైబరాబాద్ నిర్మించింది నేనే… ఆధునిక, ఆర్థిక నగరంతో పాటు పరిశుభ్రమైన సిటీగా తీర్చిదిద్దానని చెప్పాను. అవునా? కాదా తమ్ముళ్లూ’’ అంటూ పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి ఔననే సమాధానం రాబట్టుకున్నారు. అంతేకాదు ‘‘నేనే ఏం తప్పు చేశానని కేసీఆర్ టార్గెట్ చేసి తిడుతున్నారు. నన్ను తిట్టడం న్యాయమా..’’ అంటూ కార్యకర్తలు, పార్టీశ్రేణులతో పదేపదే అన్ని రోడ్ షోలలో గుర్తుచేశారు. దీని ద్వారా తెలంగాణ ప్రజలతో పాటు, సీమాంధ్రుల్లో సెంటిమెంట్‌ను పండించారు. దీని వల్ల చంద్రబాబుపై విపరీతమైన సానుభూతి వ్యక్తమవుతోందనే టాక్ వినిపిస్తోంది.