ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి పొత్తు పెట్టుకున్న టీడీపీ, కాంగ్రెస్ పొత్తు వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలోనూ కంటిన్యూ కానుందా ? వచ్చే ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటు తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు ఇప్పటికే ప్రాధమిక ఒప్పందానికి వచ్చాయా ? ఏపీలో టీడీపీతో కలిసి కాంగ్రెస్ పని చేస్తే ప్రజల అభిప్రాయం ఎలా ఉండబోతుంది ? ఏపీలో పొత్తు అవసరం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉందా ? లాంటి అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యనున్నారు. టీడీపీ, కాంగ్రెస్ మధ్య ఏపీలో పొత్తు కుదిరితే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు, సీనియర్లకు పొత్తులో భాగంగా పోటీ చేసే ఛాన్స్ ఉంటుందని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. అంటే ఏపీ పీసీసీ అధ్యక్షడు రఘువీరా రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు అవుననే అంటున్నాయి. తాజాగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంలో ఈ అంశాన్ని చూచాయగా వెల్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సమావేశంలో రఘువీరా వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ తెలుగుదేశంతో పొత్తు ఉంటుంది… పార్టీ బలంగా ఉన్న చోట నాలాంటి సీనియర్లకే అవకాశాలు వస్తాయి. మిగిలిన వారు సీట్లపై ఆశలు వదులుకోవల్సిందే… అయితే రాష్ట్రంలో పార్టీ బతకాలంటే త్యాగాలు చెయ్యాల్సిందే అని తన ఉద్ధేశాన్ని నేరుగానే చెప్పినట్టు తెలుస్తోంది.ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఉన్న 36 నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో రఘువీరా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ సీట్లలో పోటీ చేసి అన్ని చోట్ల ఓడిపోయేకంటే బలమైన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పార్టీ ముఖ్య నేతలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసి కొన్ని చోట్ల అయినా గెలుపొందడమే మంచిదని ఆయన చెప్పినట్టు తెలిసింది. పార్టీ కోసం కష్టపడి పార్టీనే నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నించగా నామినేటెడ్ పోస్టులతో న్యాయం చేస్తామని… పార్టీని బతికించేందుకు ఆ మాత్రం త్యాగాలు తప్పవని రఘువీరా వారికి సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఏపీటో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కీలక నేతలు సైతం ఇప్పుడు తమ రాజకీయ అవసరాలు కోసం వైసీపీ, టీడీపీలో చేరిపోయారు. మరి కొందరు చేరేందుకు సిద్ధం అవుతున్నారు.పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉంటే పార్టీనే నమ్ముకుని ఉన్న కీలక నేతలకు అయినా ఛాన్స్ ఉంటుందన్నది తెలిసిందే. కొంత మంది నేతలు మాత్రం ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉందన్న విషయాన్నే జనాలు మర్చిపోతున్నారని, ఇలాంటి టైమ్‌లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటన చేసినందున తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే పార్టీకి కలిసిరావడంతో పాటు ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారట. తెలంగాణలో ఇప్పటికే ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలో ఉన్నాయి. భవిష్యత్తులో ఇటు ఏపీలోనూ ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయి అన్నదానికి బలమైన సంకేతాలు కూడా వచ్చేసాయి. ఇటు రఘువీరా సైతం ముందుగానే తమ పార్టీ కేడర్‌కు ఇదే అంశంపై సూచన చెయ్యడాన్ని కూడా వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు దాదాపు ఖరారు అయినట్టే అని తెలుస్తోంది. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకునే ముందు మరో రెండు మూడు సార్లు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఏపీ కాంగ్రెస్‌లో ఉన్న ముఖ్య నేతలను, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లను కలిసి వారి అభిప్రాయాలు కూడా తీసుకోనున్నట్టు తెలుస్తోంది.ఈ లిస్ట్‌లో రెండు నుంచి మూడు ఎంపీ సీట్లతో పాటు పది వరకు అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్‌కు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా చూస్తే చంద్రబాబు గత ఎన్నికల్లోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీకి నరసాపురం, విశాఖపట్నం, రాజంపేట, తిరుపతి లోక్‌సభ సీట్లతో పాటు 15 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. అయితే బీజేపీ కేవలం 2 ఎంపీ సీట్లతో పాటు 4 అసెంబ్లీ సీట్లలో మాత్రమే విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నా గత ఎన్నికల్లో బీజేపీకి ఇచ్చినన్ని సీట్లు ఇవ్వకపోయినా 2 నుంచి 3 ఎంపీ సీట్లు, 10 వరకు అసెంబ్లీ సీట్లు ఇవ్వొచ్చని తెలుస్తోంది.పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నూలు జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు ఎంపీగానూ, ఆయన భార్య కోట్ల సుజాతమ్మ కర్నూలు జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యేగానూ పోటీ చేసే ఛాన్స్ ఉంది. అలాగే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, శింగనమల నుంచి మాజీ మంత్రి శైలజానాధ్ పోటీ చెయ్యవచ్చని అంటున్నారు. అలాగే మరో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి బాపట్ల నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. గుంటూరు తూర్పు నుంచి మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలీ పేరు రేసులో వినిపిస్తోంది. అలాగే విశాఖపట్నం నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్ పేరు సైతం లైన్‌లో ఉంది. అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి అసెంబ్లీ సీటు ఇవ్వవచ్చని సమాచారం. ఈ అంచనాలు లెక్కలు ఎలా ఉన్నా మరి చంద్రబాబు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అన్నది కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.