రాజకీయ నేతలు అవినీతి ఆరోపణలు చెయ్యడం సర్వ సాధారణం. అందుకే ప్రజలు కూడా వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ అధికారులు ఆరోపణలు చేస్తే మాత్రం, వాటికి ఆధారాలు ఉండే అవకాశాలు ఎక్కువ. అందుకే వాటిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది. తాజాగా ఏపీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైరైన అజయ్ కల్లం సంచలన ఆరోపణలు చేశారు. గత నాలుగున్నర ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఏకంగా రూ.20 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన అంచనా వేశారు. మొత్తం రూ.3 లక్షల కోట్లకుపైగా అవినీతి జరిగిందని లెక్క కట్టారు.జన చైతన్య వేదిక అధ్వర్యంలో, కర్నూలులో జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సుకు అజయ్ కల్లం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో నింగీ, నేల హద్దుగా అవినీతి పెచ్చుమీరుతోందని అజయ్ కల్లం ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు, ఇసుక, మట్టి, ఫైబర్ గ్రిడ్, నీరు–చెట్టు, నీటి కుంటలు, రెయిన్ గన్‌లు... ఇలా ప్రతీ దాంట్లోనూ అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 600 మంది, ఒక్కొక్కరూ రూ.500 కోట్లకుపైగా సంపాదించారని ధ్వజమెత్తారు. అంతేకాదు 50 మంది రూ.100 కోట్లకుపైగా, మరో 50 మంది రూ.50 కోట్లకుపైగా అక్రమంగా కూడబెట్టారని ఆరోపించారు.అజయ్ కల్లం ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా లేక చాలా మంది రాజకీయ నేతల్లాగే ఆయన కూడా పైపై ఆరోపణలు చేశారా అన్నది ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న. నిజంగా ఆధారాలుంటే అది ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామమే. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటూ... వచ్చే ఏడాది జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీడీపీ సత్తా చాటాలంటే, ఇలాంటి ఆరోపణలకు కచ్చితమైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఈ అవినీతి నిజమేనని ప్రజలు నమ్మినా ఆశ్చర్యం అక్కర్లేదు.