జనసేన తరంగం’ పేరుతో ఆ పార్టీ చేపట్టిన ఫేస్బుక్ లైవ్ కార్యక్రమం వాయిదా పడింది. ఆదివారం రాత్రి కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు జనసేన కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన పవన్కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించినట్లు జనసేన వర్గాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాయి. ఈ రోజు జరిగే వారి సంతాప సభలో పవన్ పాల్గొంటారని తెలిపాయి.‘జనసేన తరంగం’ కార్యక్రమాన్ని మంగళవారం చేపడతామని పార్టీ ప్రకటించింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనసేన పార్టీ నిన్న(ఆదివారం) అనంతపురం పట్టణంలో నిరసన కవాతు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, యువత పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అనంతరం జనసేన కార్యకర్తలు తిరిగి వెళ్తున్న కారు కర్నూలు జిల్లా డోన్ మండలం యు.కొత్తపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న కారును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.