వైకల్యాన్ని జయించి విజయాలు సాధించే స్ఫూర్తి ప్రదాతలు విభిన్న ప్రతిభావంతులు. అన్ని అవకాశాలతో ఒక వ్యక్తి ఘనత సాధిస్తే అది విజయం. కానీ వైకల్యాన్ని, శారీరక ప్రతికూలతలను అధిగమించి ఘనత సాధిస్తే చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దివ్యాంగులు సృష్టించేది, నిర్మించేది చరిత్ర. స్టీఫెన్ హాకింగ్, హెలెన్ కెల్లర్, సుధా చంద్రన్, నసీమా హర్జుక్ దివ్యాంగులుగా అద్భుతాలు సృష్టించారు. వారు ఆత్మవిశ్వాసాన్నిచ్చి నవ్యావిష్కారాలతో మరో ప్రపంచం నిర్మించారు. విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని అయన అన్నారు. ఎనభై శాతం వైకల్యం కలిగి ఉండి నడవలేని వారికి ఉచితంగా త్రిచక్ర మోటారు వాహనాలు అందిస్తున్నాం. దివ్యాంగులు శిఖరాలను అధిరోహిస్తూ స్ఫూర్తినిస్తున్నారు, వారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. దివ్యాంగులకు రూ. 114.77 కోట్లతో విజయవాడలో ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వారికి వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 20 వసతి గృహాలను నిర్వహిస్తున్నాం. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ సహా ప్రభుత్వం చేపట్టే గృహనిర్మాణంలోనూ వారికి 3% రిజర్వేషన్ కల్పిస్తాం. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీతో పాటు, ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణాల్లో 3% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించామని సీఎం అన్నారు. రాజధాని అమరావతిలో నవనిర్మాణాల్లో దివ్యాంగులు పనిచేసేందుకు అనువైన పరిస్థితులు, సదుపాయాల ఏర్పాటు చేస్తున్నామని అయన అన్నారు.