YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

కాంగ్రెస్ బీజేపీ కన్నా ఎందుకు మెరుగు..

కాంగ్రెస్ బీజేపీ కన్నా ఎందుకు మెరుగు..

పాపం కొంతమంది కుర్రకారుకు కాంగ్రెస్ అవినీతి మాత్రమే కనిపిస్తుంది. కాంగ్రెస్ చరిత్ర తెలియదు. గుడ్డినమ్మకంలో మోడీకి మూఢభక్తులుగా మారిపోయి వాస్తవాలను తెలుసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఒకసారి వారు దీన్ని చదవండి శ్రద్ధగా. దేశంలో నిర్మించబడిన ప్రతి సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించాయి. తెలుగురాష్ట్రాల్లో శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం బహుళార్ధసాధక ప్రాజెక్టులు కాంగ్రెస్ నిర్మించినవే. ప్రభుత్వరంగంలో అందరికీ ఉపాధికల్పన సాధ్యం కాదని గ్రహించి వందలాది ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేసి లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీయే. శాస్త్రసాంకేతిక రంగ పరిశోధనాసంస్థలను ఏర్పాటు చేసి సైన్స్ రంగంలో భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీయే. భారదేశంలో పాడిపరిశ్రమను ప్రోత్సహించడానికి వందలాది సంస్థలను ఏర్పాటు చేసి రైతులకు ఉపాధికల్పించింది కాంగ్రెస్ పార్టీయే.

పాకిస్తాన్ ఏర్పాటుకు సహకరించి భారతదేశం ను శాంతికాముకదేశంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఆ తరువాత పాకిస్తాన్ ఎలా ఉన్నదో, ఇండియా ఎలా ఉన్నదో అందరమూ చూస్తూనే ఉన్నాము.విశాఖలో ఉక్కుకర్మాగారం ఏర్పాటు చేసి లక్షలమందికి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. దేశంలో తొలిసారిగా అణుపరీక్షలు నిర్వహించి అమెరికా లాంటి అగ్రదేశాలను దారికి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే.పాకిస్తాన్ చీటికిమాటికి కయ్యానికి కాలుదువ్వుతూ యుద్ధానికి వస్తే ఆ దేశాన్ని చీల్చిపారేసి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణం అయింది కాంగ్రెస్ పార్టీయే. దేశంలో అనేక రైల్వే జోన్స్, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, పోర్టులు కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఉపాధిహామీపథకం తెచ్చి కూలీనాలీ జనాలకు బ్రతుకుభరోసా కల్పించింది కాంగ్రెస్ పార్టీయే.

దివాళాతీసి, బంగారాన్ని తాకట్టుపెట్టే స్థితికి దిగజారిన దేశాన్ని తమ సంస్కరణలద్వారా భారతదేశాన్ని ఆర్ధికంగా ఉరకలెత్తించి, వేలాది పరిశ్రమలను, తద్వారా కోట్లాదిమందికి ఉపాధి అందించింది కాంగ్రెస్ పార్టీయే. ఇవాళ మనం ఉపయోగిస్తున్న మొబైల్స్, కంప్యూటర్స్ దేశంలో అడుగుపెట్టడానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీయే. హరితవిప్లవాన్ని తీసుకొచ్చి భారతదేశం విదేశాలనుంచి తిండిగింజలు దిగుమతి చేసుకునే దౌర్భాగ్యన్నుంచి దేశాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీయే. టెలికాం రంగంలో విప్లవాలు, సంస్కరణలు తెచ్చి...వీధుల్లో std బూతులదగ్గర జనం క్యూ లో నించునే ఇక్కట్లను తప్పించింది కాంగ్రెస్ పార్టీయే.

పచ్చని పైరులను పండుగ చేసిన భాక్రానంగల్ బహుళార్ధసాధక ప్రాజెక్టును నిర్మించింది కాంగ్రెస్ పార్టీయే. గనుల్లో దాగిన ఖనిజసంపదలను వెలికి తీయడానికి ఏర్పాటు చేసిన నైవేలీ ప్రాజెక్ట్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిందే.భిలాయిలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పరచి లక్షలమందికి జీవితాలు ఇచ్చింది కాగ్రెస్ ప్రభుత్వమే. ఇంకా ఓడరేవులు, రైల్వే స్టేషన్స్, అనేకం కాంగ్రెస్ నిర్మించినవే.దేశంలో ఉన్న ప్రతి రక్షణరంగ సంస్థను కాంగ్రెస్ నిర్మించిందే. దేశంలో ఉన్న ప్రతి చమురురంగ సంస్థను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దేశంలో ఉపాధి పొందుతున్న ప్రతిఒక్కరి వెనుక కాంగ్రెస్ కృషి ఉన్నది. ప్రణాళికాసంఘాన్ని ఏర్పాటు చేసి దేశాన్ని ప్రణాళికాబద్హంగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్.

ఉద్యోగులు పదవీవిరమణ చేసాక వారి జీవితాలు క్షుభితం కాకుండా పెన్షన్ విధానాన్ని అమలులోకి తెచ్చి జీవితాంతం గుండెల మీద చెయ్యివేసుకునే ఆత్మస్థైర్యాన్ని కలిగించింది కాంగ్రెస్. జమీందార్లకు మాత్రమే పరిమితమైన బాంకులను జాతీయం చేసి పేదవాడికి జీరో బాలన్స్ తో ఖాతాలు తెరిపించింది కాంగ్రెస్ ప్రభుత్వమే.దేశంలో ఏనాడూ బ్యాంకుల్లో డబ్బుకు కొరతలేకుండా చేసి ఎప్పుడు వెళ్లి ఎన్ని లక్షలయినా తీసుకోగల సామర్ధ్యాన్ని కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. దేశంలో తలపొగరుతో ప్రవర్తిస్తున్న ఆరువందల సంస్థానాలను తలపొగరు దించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకం చేసింది కాంగ్రెస్ పార్టీయే.పటిష్టమైన సీలింగ్ చట్టం తెచ్చి భూస్వాముల అహంకారాన్ని దించింది కాంగ్రెస్ పార్టీయే. లక్షలాది ఎకరాలను పేదవారికి పంచి కూలీలను రైతులను చేసింది కాంగ్రెస్ పార్టీయే.జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఆంధ్రప్రదేశ్ ను సస్యశ్యామలం చేసింది కాంగ్రెస్ పార్టీయే. దేశంలో ప్రతి నిర్మాణం, ప్రతి ఆనకట్ట , ప్రతి కర్మాగారం, ప్రతి సంస్థ కాంగ్రెస్ ఏర్పాటు చేసినవే. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నపుడు షుగర్, బీపీ లాంటి వ్యాధులకు ప్రభుత్వ సంస్థ idpl ద్వారా మందులను తయారు చేయించి నెలకు పాతిక ముప్ఫయి రూపాయల్లో మందులను కొనుక్కునే వీలు ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు రేషన్ దుకాణాల్లో బియ్యం, చక్కర, నూనె, కిరోసిన్, గోధుమలు, సమృద్ధంగా దొరికేవి.

దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలన జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాం లోనే. అన్నింటిని మించి స్వతంత్ర పోరాటంలో జైలు శిక్షలు అనుభవించింది కాంగ్రెస్ పార్టీవారే. జవహర్ లాల్ నెహ్రు పదహారేళ్లు జైల్లో ఉన్నారు. ఈ దేశంకోసం ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలను కోల్పోయింది కూడా కాంగ్రెస్ ప్రధానమంత్రులే. ఒకరు అధికారంలో ఉండగా, మరొకరు ఎన్నికల పోరాటంలో ఉండగా. ఇంకా చెప్పాలంటే ఈ పేజీలు సరిపోవు. కాంగ్రెస్ కూడా అనేక పొరపాట్లను చేసింది. అవినీతిపరులను అందలం ఎక్కించింది. కుంభకోణాలకు పాల్పడింది. కానీ ఏనాడూ సామాన్యప్రజలను దోచుకోలేదు. ఇబ్బంది పెట్టలేదు. ప్రజలమీద పన్నులు వెయ్యడంలో అతి ఉదారంగా వ్యవహరించింది కాంగ్రెస్.

ఇక బీజేపీ ఏమి చేసింది?

వాజపేయి హయాంలో చక్కటి రోడ్లను నిర్మించారు. జాతీయ రహదారులను అభివృద్ధి చేశారు. అణుపరీక్షలను నిర్వహించారు. కార్గిల్ యుద్ధం చేశారు. బాగుంది. ఇక వాజపేయి హాయాంలోనే అరుణ్ శౌరి లాంటి దుర్మార్గులు చేరి పరిశ్రమల వ్యవస్థను సర్వనాశనం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను మొత్తం మూసేసి ప్రయివేట్ వ్యక్తుల చేతిలో పెట్టి లక్షలాది ఉద్యోగాలను పోగొట్టారు.

ఇక మోడీ చేసింది ఏమిటి?

3550 కోట్లతో పటేల్ విగ్రహం, 2500 కోట్లతో శివాజీ విగ్రహం. 
ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. ఒక్క సంస్థ ఏర్పాటు చేసింది లేదు. సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో రెండుగంటలపాటు ఒక నాటకం ఆడి ఏదో యుద్ధం చేసినంత ప్రచారం చేసుకున్నారు. నోట్లరద్దు, జి ఎస్ టి పేరుతో దేశాన్ని ఆర్ధికంగా సర్వనాశనం చేసారు. ఒక్క నీటి ప్రాజెక్ట్ కట్టింది లేదు. ఒక్క ఎకరం తడిపింది లేదు. పోలవరం విషయంలో ఏమి చేస్తున్నారో చూస్తున్నాము.

నీతిఆయోగ్ పేరుతో ప్రణాళికాసంఘాన్ని నాశనం చేసింది. మోడీ దయాలబ్ధంతో రాష్ట్రాలకు నిధులు వచ్చేలా రాష్ట్రాలను నిర్వీర్యం చేసింది. దేశంలో అత్యంత అవినీతి పార్టీలలో బీజేపీకి తొలిస్థానం, కాంగ్రెస్ కు రెండో స్థానం ఇచ్చింది ఆ మధ్య ఒక సర్వే. ఈ కాలం కుర్రాళ్లకు తెలియదు మరి. టీవీల్లో డప్పులు చూసి ఏమో అనుకుంటారు. వారి అవివేకానికి జాలిపడాలి తప్ప ఏమీ చేయలేము.

                                                                                 వ్యాసకర్త : ఇలపావులూరి మురళీమోహనరావు,.                                                                                                      (ఇందులోని అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం.)

Related Posts