ఐఫోన్లలో వాట్సాప్‌ను వాడుతున్న యూజర్లకు శుభవార్త. అందులో ఇప్పుడు పలు కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఉన్న కాల్ స్విచింగ్ ఫీచర్ ఇప్పుడు ఐఫోన్ వాట్సాప్ యాప్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల యూజర్లు వాట్సాప్‌లో వాయిస్ లేదా వీడియో కాల్స్‌లో మాట్లాడుతున్నప్పుడు ఒక కాల్ నుంచి మరొక కాల్‌కు స్విచ్ అవచ్చు. అంటే.. వాయిస్ నుంచి వీడియో కాల్‌కు, వీడియో నుంచి వాయిస్ కాల్‌కు మారవచ్చన్నమాట. అందుకు గాను కాల్‌లో ఉన్నప్పుడు తెరపై కనిపించే బటన్‌ను ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక దీంతోపాటు కొత్తగా @ బటన్‌ను వాట్సాప్ గ్రూప్ చాట్స్‌లో ఏర్పాటు చేశారు. దీని సహాయంతో యూజర్లు వాట్సాప్ గ్రూప్‌లలో తాము చదవని పాత మెసేజ్‌లకు సులభంగా వెళ్లి వాటిని చదవవచ్చు. ఈ ఫీచర్లను వాట్సాప్‌లో ఐఫోన్ యూజర్లు పొందాలంటే ఆ యాప్‌ను 2.18.22 వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. కొత్తగా వచ్చిన అప్‌డేటెడ్ వాట్సాప్ యాప్ ఇప్పుడు ఐఫోన్ యూజర్లకు యాపిల్ యాప్ స్టోర్‌లో లభిస్తున్నది. దాన్ని అప్‌డేట్ చేసుకుంటే కొత్త ఫీచర్లను ఆస్వాదించవచ్చు. అయితే కాల్ స్విచింగ్ ఫీచర్‌ను పొందాలంటే ఇరు వైపులా ఉన్న యూజర్లు అప్‌డేటెడ్ వాట్సాప్ యాప్‌ను ఐఫోన్‌లో వాడాల్సి ఉంటుంది.