ఎన్నికల సందర్భంగా కూటమి ఏర్పడాలంటే చాలా కష్టం. అన్ని పార్టీలూ ఒకే గొడుగు కిందకు చేరాలంటే సవాలక్ష డిమాండ్లు…అనేక కోరికలు… వీటిని తీర్చుకుంటూ పోవడం ఏ ప్రధాన పార్టీకైనా కత్తిమీద సామే అవుతుంది. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే పరిస్థితి ఇలానే ఉంది. లోక్ సభ ఎన్నికలకు ముందే కూటమి కట్టాలని భావిస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్ కు ఆదిలోనే కష్టాలు తప్పడం లేదు. కూటమిలో చేరాలనుకుంటున్న పార్టీలు పెట్టే ఆంక్షలతో ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే కూటమిలో అన్ని పార్టీలూ చేరతాయా? అన్న సందేహమూ లేకపోలేదు.డీఎంకేలో ప్రధానంగా కాంగ్రెస్ తో పాటు వైగో పార్టీ ఎండీఎంకే, వీసీకేలు ఉన్నాయి. కాంగ్రెస్ కు ఎటూ కొన్ని స్థానాలు అప్పగించక తప్పదు. ఇక మిగిలిన పార్టీలు కూడా ఎక్కువ లోక్ సభ స్థానాలను అడిగే అవకాశముంది. అయితే దీన్నుంచి బయటపడేందుకు స్టాలిన్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారంటున్నారు. ఎండీఎంకే, వీసీకే పార్టీలు సొంతంగా సీట్లు గెలుచుకునే సత్తా లేదన్నది అందరికీ తెలిసిందే. అయితే గెలుపోటములపై మాత్రం ఇవి ప్రభావం చూపుతాయన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు.అందుకే ఈ పార్టీలకు ఎక్కువ సీట్లు ఇవ్వకుండా, తమ వైపు నుంచి వెళ్లకుండా స్టాలిన్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇటీవల డీఎంకే నేత దురై మురుగన్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి అద్దం పడుతున్నాయి. ఈ పార్టీలు కూటమి కాదని, కేవలం మిత్రపక్షమేనంటూ దురైమురుగన్ వ్యాఖ్యలు చేయడంతో వైగో, తిరుమావళవన్ లు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు కూటమిలో తాము ఉన్నామా? లేదో? తేల్చి చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో స్టాలిన్ క్లారిటీ ఇస్తే తమ దారి తాము చూసుకుంటామాని వైగో కొంత కఠినంగానే వ్యాఖ్యానించారు.స్టాలిన్ కొంత దూకుడు తగ్గించి వారితో చర్చలు ప్రారంభించారు. తమిళనాడులో జరగనున్న ఉప ఎన్నికలు, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూటమి ద్వారా వెళ్లి విజయం సాధించగలిగితేనే డీఎంకే కు భవిష్యత్తు ఉందనేది స్టాలిన్ కు తెలియంది కాదు. లోక్ సభ ఎన్నికల్లో కనీసం 30 స్థానాలు దక్కితేనే పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పగలుగుతుంది. అయితే కూటమి ఏర్పడక ముందే విభేదాలు పొడచూపడంతో స్టాలిన్ కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటు వాళ్లడిగనట్లుగా ఎక్కువ స్థానాలు కేటాయించలేరు… అలాగని వారిని వదులుకోలేరు. ఇదీ స్టాలిన్ ముందున్న ప్రధాన సమస్య. మరి దీన్నుంచి ఎలా బయటపడతారో చూడాల్సిందే.