YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఐదు రాష్ట్రాల ఫలితాలతో రాహుల్ భవిత

ఐదు రాష్ట్రాల ఫలితాలతో రాహుల్ భవిత
రాహుల్ గాంధీ… అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. గుజరాత్ ఎన్నికల తర్వాత ఈ బాధ్యతలను ఆయన చేపట్టారు. ఆ తర్వాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ రాకపోయినా సంకీర్ణ సర్కార్ ను కర్ణాటకలో ఏర్పాటు చేసి కొంత పరవాలేదనిపించుకున్నారు. సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతూ అనధికారికంగానే దాదాపు మూడేళ్ల నుంచి రాహుల్ కు రాజకీయ పగ్గాలు అప్పగించారు. అప్పటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలు నమోదు చేయలేదు. ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే కాంగ్రెస్ సత్తా చూపించగలిగింది. అదీ కెప్టెన్ అమరీందర్ సింగ్ పుణ్యమా అని కాంగ్రెస్ విజయం సాధించిందన్నది విశ్లేషకుల భావన. గుజరాత్ లో జరిగిన ఎన్నికల్లో రాహుల్ ఎంత ప్రయత్నించినా విజయం సాధ్యం కాలేదు. అయితే మోదీ సొంత రాష్ట్రంలో రాహుల్ గట్టి పోటీ ఇచ్చి విమర్శకుల ప్రశంసలను సయితం అందుకున్నారు. ప్రధానంగా ఎన్డీఏ లో ఉన్న శివసేన వంటి పార్టీలు కూడా రాహుల్ ప్రతిభకు మంచి మార్కులే వేశాయి. అయితే ఇక లోక్ సభ ఎన్నికలకు ఎంతో సమయం లేదు. మరో ఐదు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ ఎన్నికల్లో విఫలమైతే అది రాహుల్ నాయకత్వంపై ప్రభావం పడే అవకాశముందన్నది వాస్తవం.లోక్ సభ ఎన్నికల కంటే ముందుగా వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా రాహుల్ నాయకత్వ భవితను నిర్దేశిస్తాయన్నది విశ్లేషకుల అంచనా. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కొన్నింటిలోనైనా కాంగ్రెస్ విజయం సాధిస్తేనే రాహుల్ ను నేతలు కూడా నమ్ముతారు. ప్రస్తుతానికయితే రాజస్థాన్, మిజోరాం, తెలంగాణల్లో కాంగ్రెస్ కు కొంత సానుకూల వాతావరణం ఉందన్నది పరిశీలకుల భావన. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో హోరా హోరీ పోరు జరిగిందని, అక్కడ ఎవరు విజేతలవుతారన్నది చెప్పడం కొంచెం కష్టమేనంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బట్టే కాంగ్రెస్ కు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పాజిటివ్ గా ఉంటుంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీని, అమిత్ షాలను అంత తక్కువగా అంచనా వేయలేం. ముఖ్యంగా ఈ ఆరునెలల్లో మోదీ తీసుకునే నిర్ణయాలు, పార్టీ పరంగా అనుసరించే విధానాలు అంత ఆషామాషీగా ఉండవన్నది పార్టీ నేతల నుంచి విన్పిస్తున్న మాట. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమ పార్టీకి ఓటమి వచ్చినా..లోక్ సభ ఎన్నికల నాటికి పుంజుకుంటామన్న ధీమా కమలం పార్టీలో వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీకి మాత్రం ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే కీలకంగా మారనున్నాయన్నది అక్షర సత్యం.

Related Posts