YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీపై గుర్రుగా కాపు సామాజిక వర్గం

వైసీపీపై గుర్రుగా కాపు  సామాజిక వర్గం
వైసీపీలో సామాజిక న్యాయం లేదంటున్నారు అందులో పుట్టి పెరిగిన నాయకులు. మిగిలిన పార్టీల మాదిరిగా జగన్ ఆయా ప్రాంతాల సామాజిక జనాభా చూసి నేతలను ఎంపిక చేయడంలేదని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ జిల్లాలో కాపు సామాజికవర్గం నాయకులు ఇపుడు వైసీపీలో జగన్ తీరుపై గుర్రుమంటున్నారు. అధికార టీడీపీ ఆ సామాజివర్గానికి న్యాయం చేస్తే జగన్ మాత్రం పార్టీకి వినియోగించుకుని టికెట్ల దగ్గరకు వచ్చేసరికి చెక్ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన మహిళా నాయకురాలు పసుపులేటి ఉషా కిరణ్ వైసీపీకి తాజాగా రాజీనామా చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల మనస్తాపం చెంది తప్పుకుంటున్నట్లుగా ఆమె చెబుతున్నారు. కాపు సామజికవర్గానికి చెందిన ఆమె ఉత్తర నియోజకవర్గం టికెట్ ఆశించారు. ఆమె పార్టీలో సీనియర్ నాయకురాలిగా ఉన్నారు. విశాఖ సిటీ మహిళా అధ్యక్షురాలిగా, పార్టీ సమన్వయ‌కర్తగా వ్యవహరించారు. ఆమె ఇపుడు హటాత్తుగా పార్టీని వీడిపోతున్నట్లుగా పేర్కొనడమే కాదు, సామాజిక న్యాయం గురించి ప్రస్తావించడంతో అక్కడ వైసీపీ ఇరుకున పడినట్లైంది.మహిళా నేత తమ వర్గానికి ప్రాముఖ్యత లేదని చెప్పడంతో కాపులు ఇపుడు ఆ పార్టీకి మైనస్ అవుతారా అన్న ఆందోళన మొదలైంది. నిజానికి టీడీపీ కాపులకు జిల్లాలో పెద్ద పీట వేసింది. ఏకంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఉండగా, అనకాపల్లి నుంచి ఎంపీగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఉన్నారు. ఎలమంచిలి నుంచి పంచకర్ల రమేష్ బాబు ఉన్నారు. పార్టీ పదవుల్లో కూడా వారికి న్యాయం జరుగుతోంది. ఎమ్మెల్సీగా అదే సామాజిక వర్గానికి చెందిన పప్పల చలపతిరావును తీసుకున్నారు.
 జనసేన రాకతో కాపులకు బలమైన వేదిక దొరికింది. దాంతో వారు సైతం తమ రాజకీయ వాటా పెంచమని పార్టీల మీద వత్తిడి తెస్తున్నారు. అదే టైంలో వైసీపీలో చూసుకుంటే జిల్లాలో గుడివాడ అమరనాధ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తప్ప మరెవరికీ కాపు సామాజికవర్గం నుంచి ప్రాధాన్యత లేదు. ఇక అర్బన్ జిల్లా నుంచి మహిళా కోటాలో, కాపు సామాజికవర్గం తరఫున తనకు అవకాశం ఉంటుందని ఆశించిన ఉషాకిరణ్ కి ఆశాభంగం ఎదురైంది. దాంతో ఆమె పార్టీకి గుడ్ బై కొట్టేశారు. ఎన్నికల వేళ ఈ పరిణామం పార్టీకి మింగుడు పడని వ్యవహారం అవుతుందని అంటున్నారు.మరో వైపు ఉషాకిరణ్ జనసేనలో చేరేందుకు రంగం సిధ్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రాయబేరాలు పూర్తి అయ్యాయని అంటున్నారు. పవన్ సమక్షంలో ఆమె మంచి రోజు చూసుకుని కండువా కప్పుకుంటారని అంటున్నారు. మంచి మాటకారి అయిన ఆమెను ఉత్తర నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో నిలబెడతారని చెబుతున్నారు. అదే జరిగితే అక్కడ ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గంలోఅంతంత మాత్రంగా ఉన్న వైసీపీ విజయావకాశాలు పూర్తిగా దెబ్బ తింటాయని అంటున్నారు.

Related Posts