రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ అన్ని రకాల ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వస్తోంది. తాజాగా మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. తన పోస్టుపెయిడ్, వీ-ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు తమ టీవీ యాప్ డౌన్లోడ్పై ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రమోషనల్ ఆఫర్ అంతకముందు కేవలం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం అర్హత గల కస్టమర్లందరికీ ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఎయిర్టెల్ తెలిపింది. ఈ ప్రమోషనల్ ఆఫర్‌తో కేవలం సినిమాలు, టీవీ షోలు చూడటానికి మరో ప్లాట్‌ఫామ్‌ను అందించడమే కాకుండా... జియోకు గట్టి పోటీ ఇవ్వడానికి దోహదం చేయనుందని కంపెనీ చెప్పింది.
2018 జూన్ వరకు సబ్స్క్రైబర్లకు ఎయిర్టెల్ టీవీ యాప్‌ను ఉచితంగా అందించడం ప్రారంభించిన వెంటనే, ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కేవలం 499 రూపాయలు, ఆపై మొత్తాలతో మైఇన్ఫినిటీ ప్లాన్లను యాక్టివేట్ చేసుకుంటున్న ఎయిర్టెల్ పోస్టు పెయిడ్ కస్టమర్లకు, వెయ్యి రూపాయల పైన ప్లాన్లు రీఛార్జ్ చేసుకుంటున్న వీ-ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్ ఎవరికైతే అందుబాటులో ఉంటుందో వారు 12 నెలల పాటు ఈ సర్వీసులను ఆస్వాదించవచ్చని కంపెనీ తెలిపింది. ఒకవేళ సబ్‌స్క్రైబర్ ఈ ఉచిత సర్వీసులను ఏప్రిల్‌లో యాక్టివేట్ చేసుకుంటే, కేవలం తొమ్మిది నెలలే ఉచిత ప్రైమ్ వాడకాన్ని పొందవచ్చు.
ఆఫర్‌ను క్లయిమ్ చేసుకోవడమెలా?
యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుంచి ఎయిర్టెల్ టీవీ యాప్‌ను సబ్స్క్రైబర్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి
లాగిన్ అయ్యాక, స్క్రోల్ డౌన్ చేయాలి. అక్కడ అమెజాన్ ప్రైమ్ బ్యానర్ కనిపిస్తుంది
బ్యాన్‌ను ట్యాప్ చేస్తే, ప్రైమ్ సర్వీసుల వివరాలతో కూడిన డైలాగ్ బాక్స్ వస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి.
అమెజాన్ అకౌంట్ వివరాలు ఇక్కడ చాలా అవసరం
ఒక్కసారి ఆ వివరాలు వెరిఫై అయ్యాక, ఉచితంగా 365 రోజుల అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ప్రారంభమవుతుంది. ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా మీకు ఈ ఉచిత సర్వీసులు యాక్టివేట్ అయినట్టు ధృవీకరణ మెసేజ్ వస్తుంది.
ఈ ఆఫర్ కూడా కేవలం ప్రైమ్ సబ్స్క్రిప్షన్ లేని అమెజాన్ యూజర్లకు మాత్రమే. ఒకవేళ మీరు ప్రైమ్ సబ్స్క్రైబర్లు అయి ఉంటే, ప్రస్తుతం నడుస్తున్న సబ్స్క్రిప్షన్ ముగిసిన తర్వాత ఈ ఆఫర్‌ను పొందాల్సి ఉంటుంది.