విశాఖ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలలో ఆయన ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం, అనుభవం ఉన్న ఆయన పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. ఆయన ఉమ్మడి ఏపీకి మునిసిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సామాజిక వర్గం అడ్డంకి కారణంగా ఆయన ఈ దఫా మంత్రి కాలేకపోయారు. ఇక 2014 ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచిన ఆయన చూపు ఇపుడు 2019 పైన ఉంది. ఈసారి తప్పనిసరిగా గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి కావాలని బండారు గట్టిగా అనుకుంటున్నారు.ఇక ఆయనకు ఏకైక కుమారుడు బండారు అప్పలనాయుడు ఉన్నారు. ఆయన పార్టీలో ఇపుడిపుడే కీలకంగా మారుతున్నారు. అంతే కాదు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ అతి జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఎమ్మెల్యే బండారు మంచిగా ఉన్నా కుమారుడు పోకడల వల్ల ఇబ్బంది కలుగుతోందని ప్రచారంలో ఉంది. ఎమ్మెల్యే సైతం కొడుకును వారసునిగా ప్రోత్సహిస్తుండటంతో క్యాడర్ సైతం ఏమి చేయలేని పరిస్థితి ఉందంటున్నారు. ఇదే ఇపుడు ప్రత్యర్తి వర్గానికి అస్త్రంగా మారిందని అంటున్నారు. కొడుకుని చూపించి జనంలో కావాల్సినంత వ్యతిరేకతను పోగు చేసేందుకు విపక్ష వైసీపీ సమాయత్తమవుతోంది. పెందుర్తి పరిధిలో భూ కబ్జా ఆరోపణలు కూడా ఎమ్మెల్యే విజయావకాశాలను దెబ్బ తీస్తున్నాయని అంటున్నారు. విశాఖలో భూ కుంభకోణాల మీద సిట్ వేయడం వెనక పెందుర్తి భూముల వ్యవహారం కూడా ఉందని అంటున్నారు. అలాగే దళిత మహిళను అవమానించారన్న ఆరోపణలు కూడా కీలక సమయంలో ప్రత్యర్థి వర్గాలు తెర మీదకు తెస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే కుమారుడు దూకుడు ఓ వైపు, ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత మరో వైపు, ఆరోపణలు ఇంకో వైపు ఈ మధ్యలో రేపటి ఎన్నికల్లో గెలిచేదెలాగో తెలియక ఎమ్మెల్యే తికమక పడుతున్నారు