- శివతత్వంలోని కొత్తకోణం
శివుడు అతని చుట్టూ వున్న వునికిపై నాకేం భక్తి వుండాల్సిన అవసరం కనిపించలేదు. బుద్దుడిపై వున్నట్లు గౌరవం, ప్రేమ అంతే చాలేమో! ఇంకా చెప్పాలంతే, జాలి అదనం!
ప్రాచీన శైవసాహిత్యంలో అన్నట్లు అతడికి తల్లిదండ్రిలేరు, అతడికి తల్లివుంటే తల జడలు కట్టనిచ్చేదిగాదు, శ్మశానంలో తిరగనిచ్చేదిగాదు, పాముల్ని ఆభరణాలుగా, బూడిదని వొంటిమీద ధరింపనిచ్చేదిగాదు, బిచ్చమెత్తుకొని బతకమనేది గాదు, అమాయకంగా పెరగనిచ్చేదిగాదు, హాలాహలం అంతకన్నా తాగనిచ్చేది కాదు!
తను అభ్యుదయవాది. ఒక స్త్రీని తలమీదపెట్టుకుంటాడు, ఇంకొక స్త్రీకైతే శరీరంలో సగభాగమిచ్చేస్తాడు! భూదేవి భరించలేనంటే, గంగను తన తలమీదుగా దిగమంటాడు! పదిమంది బాగుకై హాలాహలం కూడా తాగేస్తాడు!
అతడెప్పుడు లోకకల్యాణమంటూ, ధర్మం .. అంటూ మోసకారి మాటలతో కుట్రలు, కుతంత్రాలకు కారణమవలేదు. ఇంకా చెప్పాలంటే వాటికే ఒక్కోసారి బలవుతాడు! అతడు ప్రకృతిలో భాగం, సృష్టిలో ఒక భాగమైన వాటితోనే సహజీవనం అతడిది. ప్రకృతిలో వున్నట్టే ఆవేశం, శాంతం, త్యాగం..వంటివి తప్ప మోసం, ద్వేషం అతడి చర్యల్లో కనిపించవు. అర్థంకాని కొందరు లయకారుడంటే వినాశకుడంటారు, అదేనిజమైతే అతడు ఎంతమందిని హరించాడో చెప్పాలి!
సింధూ నాగరికత మొదలు అతడు ఈ నేలవాడు! ఈ నేల రంగు వాడు! ఈ నేలమీది పంచభూతాలతోనే అతడి సహవాసం. అతడిమీద, అతడిచుట్టూ జంతువులే! పురాణేతిహాసాల్లో వోడిపోయిన వారంతా అతని పక్షమే! అందుకే అతడికి, అతడి సాహిత్యానికి పెద్ద రాజపోషణ దక్కలేదు! ఆలా దొరక్కపోవడమే మంచిదయిందేమో, ఆదికవి కావల్సిన నన్నెచోడుని నన్నయ తొక్కేయవచ్చుగాక, సామాన్య జనపు సాహిత్యాన్నే గాక, ఇప్పుడు సగర్వించే పండిత ప్రక్రియల్నీ అతడి తాలూకు సామాన్య జన సాహిత్యం అద్బుతంగా సృజించింది.
అతడు సృష్టిలోని ప్రాణి ఉనికిని అత్యంత సహజంగా గుర్తించేశాడు. ఒక గింజకు జన్మనిస్తుంది కాబట్టి భూమికి ఎలా గౌరవముందో, అలాగే రెండు ప్రాణులు కలిసి ఇంకొక ప్రాణి పుట్టుకకు కారణమయ్యే యోని-లింగానికి ప్రాతినిధ్యం గొప్పగా చూపాడు. ఈ గొప్పదనాన్ని గుర్తింపజేసేందుకు పేరొందిన మతాల్లా మనిషికీ తనకూ మధ్య మరో పూజారి వర్గంలేదు! అందుకే అతడి ప్రసన్నతను ఆశించేది రాక్షసులనబడే సమాజంలోని కిందివర్గాలవారు! అతనిగురించిన సాహిత్యంలోని గొప్ప భక్తులు గొడగూచి, సంగయ్య, దుగ్గవ్వ, కుమ్మరి గుండయ్య, కక్కరయ్య, ఉడుమూరి కన్నప్ప, సకలేశమాది రాజయ్య..వంటి సామాన్య కింది తరగతి జనాలే! ఆడవుల్లోని అనాగరిక మనుకునే వారితోనే అతని సహవాసం. మెదళ్లూ, నాలుకలూ తిరిగిన సిద్దాంతాలూ, భక్తీ అతడికి నచ్చవు. కాలితో వూడ్చి, పుక్కిటి నీళ్లతో అభిషేకించే కన్నప్ప భక్తే అతడికి కావాలి. నిష్కళంకమైన సిరియాళుని భక్తే కావాలి! ఒక రసికుడికి వేశ్య చనుమొనలో కనపడతాడు, ఒక గొల్లకు మేక పెంటికలో దర్శనమిస్తాడు కావాలంటే!
నిజానికి దైవత్వానికి ప్రత్యామ్నాయం దయ, క్షమ, నిరాడంబరత, అభ్యుదయం.. వంటి భావనలే. వాటికి శివుడు ప్రాతినిధ్యం వహిస్తాడు!