2019 ఏప్రిల్ 1 నుంచి కొత్త సరళీకృత జీఎస్‌టీ రిటర్న్ ఫారాలు అందుబాటులోకి వస్తాయని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో జీఎస్‌టీ రూపేణా ప్రభుత్వం రూ.7.76 లక్షల కోట్లు వసూలు చేసింది. బడ్జెట్లో రూ.13.48 లక్షల కోట్లను వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అంటే నెలకు రూ.1.12 లక్షల కోట్లను వసూలు చేయాలన్నమాట. ‘నవంబరులో లక్ష్యానికి రూ.4,000 కోట్లు తగ్గాయి. అయితే లక్ష్యం సాధించే విషయంపై తుది అవగాహన వచ్చేందుకు ఇంకొన్ని నెలల గణాంకాలు అవసరం. లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకమైతే ఉంది. మా నెలవారీ వసూళ్ల లక్ష్యం రూ.లక్ష కోట్లు. దీనిని రూ.1.10 లక్షల కోట్లకు పెంచుకోవాలని భావిస్తున్నామ’ని పాండే వెల్లడించారు. నవంబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.97,637 కోట్లుగా నమోదయ్యాయి.