తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ దంపతులు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద ఆలయ మర్యాదల ప్రకారం గవర్నర్ నరసింహన్ దంపతులకు టిటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జెఈఓ శ్రీనివాస రాజు , అర్చకులు ఇస్థికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం , వకుళామాత దర్శనం చేసుకుని, విమాన వెంకటేశ్వర స్వామి ని మొక్కుకుని, శ్రీవారి హుండీలో మొక్కులు, కానుకలు చెల్లించారు. రంగనాయక మండపంలో గవర్నర్ దంపతులు వేద పండితుల వేదాశీర్వచనాలు అందుకుని, స్వామివారి తీర్థ ప్రసాదాలు సేవించారు. అనంతరం టిటిడి ఉన్నతాధికారులు శ్రీవారి లడ్డూ ప్రసాదాలను, కోత్త యేడాది డైరీలు, క్యాలెండర్లను గవర్నర్ దంపతులకు అందించారు. దర్శనానంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో చేసిన పలు మార్పులు బాగున్నాయన్నారు. భక్తులకు పురాతన కట్టడాలను చూసే అవకాశం కల్పించడం అభినందనీయమని కొనియాడారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోందని నరసింహన్ తెలిపారు. మహాసంప్రోక్షణ అనంతరం శ్రీవారి ఆలయం కొత్తగా తయారయినట్లు అనిపించిందన్నారు. ముఖ్యంగా ధ్వజస్తంభం బయటి నుండే అందరికీ కనిపించే విధంగా ఉండడంతో భక్తులకు ఎంతో బాగుందని పేర్కొన్నారు. తిరుమల ను టిటిడి వారు ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నారని అభినందించారు. తరువాత శ్రీవారి ఆలయం నుండి నేరుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి గవర్నర్ దంపతులు బయలుదేరి వెళ్లారు.