ఉద్యోగ కల్పనలో ఐఎస్‌బీ దూసుకుపోతున్నది. హైదరాబాద్, మొహాలీలలో ఉన్న క్యాంపస్‌లలో చదువుకున్న విద్యార్థులను చేజిక్కించుకోవడానికి దేశీయ, అంతర్జాతీయ సంస్థలు క్యూకడుతున్నాయి. దీంట్లోభాగంగా 2019 సంవత్సరానికిగాను నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో 1,194 మంది విద్యార్థులను కార్పొరేట్ సంస్థలు చేజిక్కించుకున్నాయి. గతేడాది 816 మందితో పోలిస్తే 29 శాతం పెరుగుదల నమోదైంది. సరాసరిగా ఒక్కోక్కరికి రూ.25.06 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేశాయి. ఈ క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో అమెజాన్, బెయిన్, బీసీజీ, డెలాయిట్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌ఈకే కన్సల్టింగ్, మెకెన్సీ, మైక్రోసాఫ్ట్, ఓయో రూమ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, రివిగో, సామ్‌సంగ్, ఉబర్ వంటి దిగ్గజ కంపెనీలు పాల్గొన్నాయి. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాల కేంద్రంగా ఐఎస్‌బీఐ మారిపోయిందని, దీంతో కార్పొరేట్ దిగ్గజాలు తమ విద్యార్థులకోసం వేచి చేస్తున్నారని ఐఎస్‌బీఐ డీన్ రాజేంద్ర శ్రీవాత్సవ తెలిపారు. భారత్‌లో వ్యాపారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం వస్తున్న ఏకైక క్యాంపస్ తమేదనని, ఇలా గ్లోబల్ సంస్థలు వస్తుండటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో తమకు నమ్మకం మరింత పెరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2019 సంవత్సరానికిగాను నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాలు పొందిన వారిలో 35 శాతం అంటే 306 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు.