వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, తెలంగాణ యూనిట్ జనరల్ సెక్రటరీ శివకుమార్ షాకిచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని పత్రికా ప్రకటన ఇచ్చారు. అధినేత ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ ప్రకటన ఉండటంతో.. పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరించారు. ‘వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర రెడ్డిని దుర్మార్గుడు అన్నారు. ఈ మాటలను ఖండిస్తున్నా, టీఆర్ఎస్‌కు ఓటేయొద్దని కోరుతున్నా. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేయడం లేదు. వైఎస్ తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ అభిమానుల పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ప్రకటిస్తున్నాం’ అని శివకుమార్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని వైఎస్ఆర్‌సీపీ తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా శివ కుమార్ ప్రకటన ఉంది. జగన్‌కు కూడా చెప్పకుండా.. పత్రికా ప్రకటన రిలీజ్ చేయడంతో పార్టీ శ్రేణులు షాకయ్యాయిం. దీంతో పార్టీ నుంచి శివ కుమార్‌ను శాశ్వతంగా బహిష్కరిస్తూ ఆ పార్టీ పత్రికా ప్రకటన జారీ చేసింది. వైఎస్ మరణం తర్వాత.. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోయిన జగన్ వైఎస్ఆర్‌సీపీ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నారు. వాస్తవానికి ఈ పార్టీని శివ కుమార్ పేరిట రిజిస్టర్ అయ్యింది. తన తండ్రి పేరు, అప్పటి దాకా ఉన్న పార్టీ పేరు కలిసొచ్చేలా ఉండటంతో వైఎస్‌ఆర్‌సీపీ పార్టీని శివ కుమార్ దగ్గర్నుంచి జగన్ తీసేసుకున్నారు. ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. రాష్ట్రం విడిపోయాక.. తెలంగాణలో పార్టీకి కీలక నేతలు దూరమయ్యారు. దీంతో పార్టీ తెలంగాణ బాధ్యతలను శివకుమార్ పర్యవేక్షించే వారు.