నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజా సమస్యలపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. స్థానిక నేతలతో కలిసి మురికి కాలువలోకి దిగారు. అధికారులు వచ్చి సమస్యపై స్పందించే వరకు కదలేది లేదంటూ కాలువులోనే నిలబడ్డారు. కొద్దిసేపటికి అక్కడికి ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు ఎమ్మెల్యేకు సర్ది చెప్పారు.నెల్లూరులోని ఉడుముల వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోటంరెడ్డి చాలా రోజులుగా కోరుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎవరూ స్పందించకపోవడంతో బుధవారం ఆందోళనకు దిగారు. వంతెన కట్టడం సంగతి పక్కన పెడితే.. పాత బ్రిడ్జి గోడలు పగలు కొట్టి అసంపూర్తిగా వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కోటంరెడ్డి నిరసనకు దిగడంతో వైసీపీ నేతలతో పాటూ స్థానికులు భారీగా అక్కడికి చేరుకున్నారు.