తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు సంగతేంటో కానీ ఆశలు ఆవిరై మూలన పడిపోయిన విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేసింది. మీటింగ్ పెడితే పట్టుమని పదిమంది కూడా రాని చోట ఇపుడు హడావుడి బాగానే పెరిగింది. పైగా ఆశావహులు, ఇతర పార్టీల నుంచి వచ్చే వారు కూడా ఎక్కువయ్యారు. కాంగ్రెస్ కు తక్కువలో తక్కువ విశాఖ జిల్లాలో మూడు సీట్లు టీడీపీ కేటాయిస్తుందన్న సమాచారంతో నేతలు అపుడే కర్చీఫ్ వేసేస్తున్నారు. అర్బన్… రూరల్ అన్న తేడా లేకుండా పాత నాయకులు పోటీకి తయారవుతున్నారు.ఇక విశాఖ నగరంలో కార్మికులు ఎక్కువగా ఉండే పారిశ్రామిక వాడ గాజువాక 2009 లో నియోజకవర్గాల పునర్విభజన లో కొత్తగా ఏర్పాటైంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో ప్రైవేట్ సంస్థలు కూడా అధికంగా ఉంటాయి. దాంతో కార్మిక వర్గం ఎక్కువ. ఇక్కడ ఎమ్మెల్యే కావాలంటే ముందు యూనియన్ లీడర్ గా పలుకుబడి నిరూపించుకోవాలి. ఇపుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కూడా కార్మిక నాయకుడే. దాంతో రేపటి ఎమ్మెల్యే సీటు కోసం పలువురు కార్మిక నాయకులు యధా శక్తిగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక్కడే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఐఎంటీయూసీ నాయకునిగా చక్రం తిప్పుతున్న మంత్రి రాజశేఖర్ కాంగ్రెస్ లోనూ సీనియర్ నేతగా ఉన్నారు. యూనియన్ రాజకీయాల్లోనే ఉంటూ వచ్చారు. ఇపుడు ఆయన రాజకీయ రంగంలో కూడా అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. గాజువాక నుంచి పోటీ చేసేందుకు ఆయన రంగం సిధ్ధం చేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా గాజువాక నుంచి టికెట్ తనకే దక్కేలా ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఆయన అనుచరులు మీటింగులు పెట్టి తమ నేతకే టికెట్ ఇవ్వాలంటూ హై కమాండ్ కి విన్నపాలు చేస్తున్నారు. నిజానికి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. మరో వైపు జనసెనా, వైసీపీ బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పరంగా పోటీ చేస్తే గెలుపు మాట దేముడెరుగు డిపాజిట్ కూడా రాదు, టీడీపీతో పొత్తు ఉంటే త్రిముఖ పోటీలో విజయం ఖాయమని భావిస్తూ మంత్రి రాజశేఖర్ ముందుకు సాగుతున్నారు. . ఐఎన్ టీయూసీ యూనియన్ కోటాలో ఆయన టికెట్ కోరుతున్నారు. .విశాఖ సిటీ అధ్యక్షుడి కోటాలో టికెట్ తనకు ఇవ్వలని బెహరా భాస్కరరావు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఆయనకు 2014 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది అయితే విభజన వల్ల వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో ఆయన టికెట్ వద్దనుకున్నారు. ఇపుడు మారిన రాజకీయ వాతావరణంలో టీడీపీ మద్దతు ఉంటే సులువుగా గెలవవచ్చునని టికెట్ కోరుతున్నారు. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరాలని కూడా ఆయన భావిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే జనసేనలోకి కూడా వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఏ మాత్రం కదలిక లేని కాంగ్రెస్ లో ఇపుడు గెలుపు ఆశలు మొలకెత్తుతున్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు హిట్ అయితే మరింతమంది నేతలు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర నుంచి కూడా పోటీకి రెడీ అవుతారని అంటున్నారు. వీరి సంగతి ఇలా ఉంటే బయట నుంచి టికెట్ రాదనుకున్న వారు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చునని పార్టీలోకి వస్తున్నారు. ఇది హస్తం పార్టీకి కొత్త పరిణామంగా చెప్పుకోవాలి.