YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైఎస్ ఎంట్రీతో టీడీపీ జైత్రయాత్రకు బ్రేకులు

వైఎస్ ఎంట్రీతో టీడీపీ జైత్రయాత్రకు బ్రేకులు
కళా వెంకట్రావు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి పోటీ చేసి ఓడిపోయిన ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. గత ఎన్నికల్లో పెద్ద మెజారిటీ రాకపోయినా కళా వెంకట్రావునే విజయం వరించింది. కళా వెంకట్రావును ఓడించాలన్న ధ్యేయంతోనే జగన్ పాదయాత్ర ఈ నియోజకవర్గంలో ముమ్మరంగా చేస్తున్నారు. వీలయినన్ని ఎక్కువ రోజులు ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించారు. జగన్ పాదయాత్రకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంచి స్పందన లభిస్తోంది. ఎచ్చెర్ల నియోజకవర్గం 2009 వరకూ ఎస్సీ నియోజకవర్గంగానే ఉండేది. అయితే అప్పుడు జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ నియోజకవర్గంగా మారింది. 1978వ సంవత్సరం నుంచి రిజర్వ్ డ్ నియోజకవర్గంగా ఉన్న ఎచ్చెర్లలో టీడీపీయే అధికంగా గెలవడం విశేషం. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రతిభాభారతి ఐదు సార్లు గెలవడం విశేషం. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో ఈ నియోజకవర్గంలో అప్రతిహతంగా కొనసాగుతున్న టీడీపీ జైత్రయాత్రకు బ్రేకులు పడ్డాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కొండ్రు మురళీ మోహన్ ఇక్కడ విజయం సాధించడం విశేషం. 2009 ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలకంఠం గెలుపొందారు. గత రెండు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయిన తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో మాత్రం కళా ఎంట్రీతో విజయం సాధించింది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కళా వెంకట్రావుకు, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్ కుమార్ కు మధ్య ఓట్ల తేడా కేవలం 4,741 ఓట్లు మాత్రమే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఎచ్చెర్ల నియోజకవర్గంలో పార్టీ జెండాను ఎగురవేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు జగన్ . గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గొర్లె కిరణ్ కుమార్ ఇప్పుడు కూడా ఆ నియోజకవర్గ సమన్వయ కర్తగా కొనసాగుతున్నారు. మరోసారి ఆయనకే సీటు దక్కే అవకాశాలున్నాయి.మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కళా వెంకట్రావుపై ఉన్న వ్యతిరేకతతో తాము ఈసారి ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు టీడీపీలో గ్రూపుల గోల కూడా తమకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఎచ్చెర్లలో ఇప్పటికీ టీడీపీ నేత ప్రతిభా భారతికి బలం ఉంది. ఆమెకు రాజాం సీటు దక్కకుండా, కొండ్రు మురళిని కాంగ్రెస్ నుంచి టీడీపీ లోకి తీసుకురావడంలో కళా వెంకట్రావు పాత్ర ఉందని ప్రతిభా భారతి వర్గీయులు బలంగా నమ్ముతున్నారు. తమనేతకు టిక్కెట్ దక్కకుండా అడ్డుపడిన కళా వెంకట్రావు విజయానికి సహకరించేది లేదని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరి ఈసారి కళా వెంకట్రావు ను ఓడించాలన్న ఉద్దేశ్యంతో సాగుతున్న ఈ యాత్ర వల్ల వైసీపీకి ఎంతమేర లాభిస్తుందనేది చూడాల్సి ఉంది.

Related Posts