ఉప ఎన్నికలు, రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ప్రధనంగా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే అన్ని అవకాశాలనూ తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో మిత్రపక్షాలకు ఎక్కువ సీట్లు ఇచ్చి, లోక్ సభ ఎన్నికల్లో తగ్గిద్దామన్న యోచనలో డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే డీఎంకే మిత్రపక్షంగా కాంగ్రెస్, వైగోపార్టీతో పాటు మరోచిన్నాచితకా పార్టీలు ఉన్నాయి. వీటి బలం కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుండటంతో స్టాలిన్ ప్రధాన పార్టీలను కలుపుకునే ప్రయత్నాలను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది..ఇందులో భాగంగానే కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్, టీటీవీ దినకరన్ కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని కూడా కలుపుకునేందుకు స్టాలిన్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ సినీ నటుడు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రభావం చూపే అవకాశముంది. రజనీకాంత్ పార్టీ కూడా ఈ నెలలోనే వస్తుండటంతో కమల్ ను తమవైపునకు తిప్పుకుంటే కొంత ప్రయోజనం ఉంటుందన్నది స్టాలిన్ ఆలోచన. ఈ మేరకు కమల్ హాసన్ తో చర్చించాలని స్టాలిన్ నిర్ణయించారు.అలాగే అన్నాడీంకే నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ పార్టీకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉంది. దినకరన్ కూడా పొత్తు కోసం వేచిచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఉప ఎన్నికలు జరిగే 20 స్థానాల్లో 18 స్థానాల్లో దినకరన్ కు సహకరిస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే జయలలిత నెచ్చలి శశికళను మాత్రం దూరంగా ఉంచాలని స్టాలిన్ షరతులు విధించే అవకాశముందంటున్నారు. ఈ నేపథ్యంలోనే కమల్ , దినకరన్ పార్టీలు కలసి వస్తే తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ నేత రాజా అనడం ఇందులో భాగమేనంటున్నారు.ఈ నెల 16వ తేదీన కరుణానిధి, అన్నాదురై విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంతో పాటు విపక్షాలతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని స్టాలిన్ ప్లాన్ చేస్తున్నారు. సోనియాగాంధీతో పాటు దేశవ్యాప్తంగా బీజేపేయతరపార్టీలను తమిళనాడుకు రప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నెల 10వ తేదీన స్టాలిన్ ఢిల్లీకి వెళ్లి సోనియాను ఆహ్వానించనున్నారు. మొత్తం మీద ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తమిళనాడులో ఊహించని పార్టీలు కూడా స్టాలిన్ పంచన చేరే అవకాశాలున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.