ఆధార్ చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చట్టంలో కొత్త ప్రతిపాదనలు తుది దశకు చేరుకున్నాయి. పౌరులు తమ ఆధార్ నెంబర్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నారు. బయోమెట్రిక్స్‌తోపాటు డేటాను కూడా వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఇటీవల ఆధార్ చట్టబద్దతపై సెప్టెంబరులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆధార్ చట్టంలోని 57వ సెక్షన్‌ను రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. పౌరుల ఆధార్ డేటా వివరాలను ప్రైవేటు సంస్థలు వినియోగించుకోరాదని తన ఆదేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులకు ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని కూడా ధర్మాసనం వ్యతిరేకించింది. దీంతో ఆధార్ విత్‌డ్రా చేసుకునే విషయమై యూడీఏఐ కొత్త ప్రతిపాదనలు చేసింది. 18 ఏళ్లు పూర్తయిన వ్యక్తులు ఎవరైనా తమ ఆధార్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు ఆరు నెలల సమయాన్ని కేటాయించనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనను పరిశీలించిన న్యాయశాఖ.. దీన్ని ప్రతి పౌరుడికి వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే ఇప్పటి వరకు పాన్ కార్డు లేని వారికి మాత్రం ఈ కొత్త నిబంధన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపనున్నారు. దేశవ్యాప్తంగా 2018 మార్చి 12 వరకు 37.50 కోట్లు పాన్ కార్డులు జారీచేయగా, వీటిలో వ్యక్తిగత కార్డలు 36.54 కోట్లు. ఇప్పటి వరకు 16.84 కోట్ల పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆధార్ విషయంలో ఒక న్యాయనిర్ణేత అధికారిని నియమించాలని కేంద్రం భావించింది. జాతీయ భద్రత దృష్ట్యా పౌరుల వివరాలను బహిర్గతం చేసే ఆధార్ చట్టంలోని సెక్షన్ 33(2)ను సైతం సుప్రీంకోర్టు రద్దుచేసింది.