ఉస్మానియాలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. ఇది చూసిన వారి హృదయాలు ద్రవించిపోయాయి. అప్రయత్నంగానే కళ్లు చెమర్చాయి. ప్రతి ఒక్కరి మనసుల్లోంచి మాటలకందని దు:ఖం పొంగుకొచ్చింది. కాటేదాన్‌కు చెందిన 36 ఏళ్ల సమీనా సుల్తానా గుండె సంబంధ సమస్యలతో బాధపడుతూ ఆదివారం రాత్రి తన ఐదేళ్ల కుమారుడితో కలిసి ఉస్మానియా ఆసుపత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు రక్షించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కార్డియో పలమనరీ రెసస్‌సియేషన్ (సీపీఆర్) చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ కాసేపటికే మృతి చెందింది. అయితే ఆమె పక్కనే ఉన్న ఐదేళ్ల చిన్నారికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆమెను విడిచి ఉండేందుకు నిరాకరించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నాడు. బాలుడి వేదన చూసిన వైద్యులు, సిబ్బంది కూడా ఏమీ చేయలేని నిస్సహాయస్థితికి చేరుకున్నారు. తల్లి మృతదేహం పక్కనే బాలుడు ఐదు గంటలపాటు నిద్రపోయాడు. ఈ ఘటన చూసిన వారి కళ్ల నుంచి అప్రయత్నంగా కన్నీళ్లు పొంగుకొచ్చాయి. చివరికి అతి కష్టం మీద ఐదు గంటల తర్వాత బాలుడిని బలవంతంగా తల్లి నుంచి వేరు చేయగలిగినట్టు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ (హెచ్‌హెచ్ఎఫ్) వలంటీర్ ఇమ్రాన్ మహమ్మద్ తెలిపారు.
హెచ్‌హెచ్ఎఫ్‌కు చెందిన మరో వలంటీరు ముజ్తాబా హసన్ అస్కరీ కథనం ప్రకారం.. సమీనా సుల్తానా భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో రాజేంద్రనగర్‌లో మరో వ్యక్తితో కలిసి ఉంటోంది. అనారోగ్యంతో బాధపడుతున్నఆమెను ఆదివారం రాత్రి అతడు ఆసుపత్రి వద్ద దిగబెట్టి వెళ్లిపోయాడు.
బాలుడు.. తల్లి మృతదేహం పక్కనే ఐదు గంటలుగా నిద్రపోతున్నాడని, పోస్టుమార్టానికి తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నాడని తమకు రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చినట్టు హెచ్‌హెచ్ఎఫ్ తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొంది. తల్లి నుంచి బాలుడిని వేరు చేసేందుకు తమ వలంటీర్లకు రాత్రంతా పట్టిందని పేర్కొంది. 18 గంటల తర్వాత జహీరాబాద్‌లో ఉంటున్న సమీనా సుల్తానా బంధువులను గుర్తించి బాలుడిని వారికి అప్పగించినట్టు తెలిపింది. అ తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న సమీనా బంధువులు తదుపరి కార్యక్రమాలను పూర్తి చేశారు. తల్లి మృతదేహం పక్కన నిద్రపోతున్న బాలుడి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాతో కన్నీళ్లు పెట్టిస్తోంది.