అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ క్రికెట్ కెరీర్‌ను ముగించిన ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్ తరవాత ఏం చేయబోతున్నారు అనే విషయంపై ఇప్పుడు చర్చ మొదలైంది. గతంలో పలు జాతీయ అంశాల్లో గంభీర్ చొరవ, వాదన చూస్తుంటే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ రాజకీయాల్లోనే అని చాలా మంది అంటున్నారు. జాతీయ అంశాల్లో పేరుమోసిన రాజకీయ నాయకులను ప్రశ్నించడం, వారిపై ఆరోపణలు గుప్పించడం చూస్తుంటే ఇదే నిజమనిస్తోంది. కశ్మీర్ వ్యాలీలో మన్నన్ వని అనే ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టిన నేపథ్యంలో మరో విద్యావంతుడైన కశ్మీరీ యువకుడు ప్రాణాలు కోల్పోయాడని కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. దీనికి గంభీర్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. ఉన్నత విద్యావంతులు, ప్రతిభగలవారు ఉగ్రవాదులు కాలేరని.. ప్రాణాలు తీసేవారిని విద్యావంతులని సంభోదించడం ఏంటని గంభీర్ ప్రశ్నించారు.అంతేకాకుండా, దేశ భౌగోళిక చిత్రపటాన్ని మార్చేందుకు ఒమర్ అబ్దుల్లా ప్రయత్నించారని, కశ్మీరీ యువతను సరైన మార్గంలో నడిపించేందుకు ఇతర రాజకీయ నాయకుల్లానే ఒమర్ అబ్దుల్లా చేసిందేమీ లేదని గంభీర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కశ్మీర్ వ్యాలీలో శాంతిని నెలకొల్పడంలో సాయుధ దళాల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. ఇదొక్కటే కాదు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం ట్విట్టర్ వేదికగా గంభీర్ ఓ ఆటాడుకున్నారు. కేజ్రీవాల్‌ను ‘మఫ్లర్ మ్యాన్’ అని సంభోదించిన గంభీర్.. ఢిల్లీలో గాలి కాలుష్యం పట్ల ప్రభుత్వం ఓవర్ యాక్షన్ తప్ప దిద్దుబాటు చర్యలు ఏం చేపడుతోందని మండిపడ్డారు.దసరా రోజున పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటనపై కూడా గంభీర్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ ఘటనలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడాన్ని గంభీర్ తప్పుబట్టారు. కేవలం జాతీయ రాజకీయాల్లో కలుగజేసుకోవడమే కాదు.. గంభీర్‌లో మానవతా కోణం కూడా ఉంది. 2017లో వచ్చిన ఐపీఎల్ ప్రైజ్ మనీని సుక్మాలో నక్సల్స్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 27 మంది కుటుంబాలకు దానం చేశారు.ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఇండియన్ ఐస్ హాకీ టీమ్‌కు 2015లో 4 లక్షలు విరాళం ఇచ్చారు. కేరళ వరదలు సంభవించినప్పుడు బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. అప్పుడే గంభీర్ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని గంభీర్ కొట్టిపారేశారు. అయితే, గంభీర్ చొరవ చూస్తుంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయాలకు కరెక్ట్‌గా సరిపోతాడనే వాదన వినిపిస్తోంది. మరి గంభీర్ నెక్ట్స్ స్టెప్ ఎటువైపు పడుతుందో చూడాలి.