జడ్పీ సమావేశంలో ప్రధానంగా సాగు, తాగునీటి విషయంపై చర్చించాం. గత నెలలో 67 శాతంగా ఉన్న లోటు వర్షపాతం ఇటీవల కురిసిన వర్షాలతో 53 శాతానికి తగ్గింది. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గురువారం అయన నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ సోమశిల పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంతో ఒక్క టీఎంసీ కూడా ఇన్ ఫ్లో లేదు. క్రిష్ణా జలాలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా జిల్లాకు 48 టీఎంసీలు తెచ్చాం. 3.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని నిర్ణయించాం. కండలేరుకు 15 టీఎంసీలు మళ్లించాం.. తాగునీటి అవసరాలకే వినియోగిస్తాం. కండలేరు సిస్టమ్ కింద 20 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిస్తున్నామని అన్నారు. గత ఏడాది 7 లక్షల ఎకరాలకు నీరిచ్చాం..2016లో సుమారు 9 లక్షల ఎకరాలు పండించామన్నారు. కరువు ప్రభావంతో ఈ ఏడాది సాగువిస్తీర్ణం తగ్గించాం. తాగునీటి సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాం..ఇంటింటికీ కుళాయి పథకానికి 1200 కోట్లతో టెండర్లు పిలిచాం. సోమశిల హైలెవల్ కెనాల్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. రూ.340 కోట్లతో పాఠశాలల్లో వసతులు కల్పించబోతున్నాం. నీరు-ప్రగతి పనుల్లో చెరువుల మరమ్మతులకు ప్రాధాన్యమిచ్చాం ప్రపంచ బ్యాంకు నిధులు రూ.75 కోట్లు, జైకా నిధులు రూ.20 కోట్లతో చెరువుల ఆధునికీకరణకు చర్యలు తీసుకున్నామన్నారు. రుణమాఫీ 4వ, 5వ విడతలకు సంబంధించిన మొత్తాన్ని వడ్డీతో కలిపి ఒకేసారి త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేస్తాం జిల్లాలో రైతుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి పొంగూరు నారాయణ, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గోన్నారు.