కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. చాలా స్థానాల్లో సిట్టింగులను తొలగించి కొత్తవారికి సీట్లు కేటాయించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా సినీతారలపై ఆ పార్టీ కన్నేసింది. బాలీవుడ్ గ్లామర్ డాల్ మాధురీ దీక్షిత్‌ను లోక్‌సభకు పోటీ చేయించాలని భావిస్తోంది. సంపర్క్ ఫర్ సమర్ధన్( బీజేపీకి మద్దతు కోసం) కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ ఏడాది జూన్‌లో మాధురీ దీక్షిత్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేపట్టిన పథకాల గురించి ఆమెకు వివరించారు. అప్పట్నుంచీ ఆమె కమలదళంలో చేరనున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై మాధురి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో భాజపా సీనియర్ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. పుణె లోక్‌సభ స్థానానికి సంబంధించిన రూపొందించిన జాబితాలో మాధురి పేరు వెల్లడించారు. ‘2019 సార్వత్రిక ఎన్నికల్లో మాధురీ దీక్షిత్‌ను ఎలాగైనా బరిలోకి దించాలని పార్టీ యోచిస్తోంది. ఆమెకు పుణె లోక్‌సభ నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉంది’ అని ఆ నేత తెలిపారు. పార్టీ రూపొందించిన షార్ట్ లిస్ట్‌లో కూడా ఆమె పేరు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న పుణె నియోజకవర్గాన్ని 2014లో బీజేపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి అనిల్ షిరోలి ఏకంగా మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.