బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీకి కోల్‌కతా హైకోర్టు అనుమతి నిరాకరించింది. భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రథ యాత్ర’కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. యాత్ర వల్ల రాష్ట్రంలో మత పరమైన విద్వేశాలు చెలరేగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కోల్‌కతా హైకోర్టుకు తెలియజేసింది. కోచ్‌బేర్‌లో జిల్లాలో శుక్రవారం నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్వహించనున్న ‘రథ యాత్ర’కు మత పరమైన కల్లోలాల జరిగే అవకాశం ఉండటంతో జిల్లా ఎస్పీ అనుమతి నిరాకరించారని న్యాయవాది కిశోర్ దత్త వెల్లడించారు. గతంలో కూడా జిల్లాలో ఇటువంటి అల్లర్లు జరిగిన దాఖలాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే బీజేపీ ర్యాలీ ప్రశాంతంగా సాగుతుందని బీజేపీ తరపు న్యాయవాది ఆనంద్ మిత్ర జస్టిస్ తపాబ్రత చక్రబూర్తితో కూడిన ధర్మాసనానికి తెలిపారు. ఒక వేళ అల్లర్లు చెలరేగితే దానికి బాధ్యులెవరని ధర్మాసనం బీజేపీని ప్రశ్నించింది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ చెప్పినప్పటికీ లా అండ్ ఆర్డర్‌ను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అందులో భాగంగా ర్యాలీలకు అనుమతి నిరాకరించే అధికారం కూడా ఉంటుందని ధర్మాసనం పేర్కొంటూ అనుమతి నిరాకరించింది. కాగా గతంలో మమతా సర్కార్...అమిత్ షా ర్యాలీకి అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే..