తాము ‘మేం తీసుకునే ప్రతి చర్య ఆశించిన ఫలితం ఇచ్చేట్లుగా చూసుకునేందుకు తాము తప్పకుండా గతంలో జరిగిన విషయాలను పరిశీలిస్తూ ఉంటాం. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల మేం విఫలమవకూడదు కదా!’’ అని కేంద్ర రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయుల్ అన్నారు. భారత పారిశ్రామిక, వాణిజ్య మండలుల సమాఖ్య (ఫిక్కీ), శాస్త్ర డీమ్డ్ విశ్వవిద్యాలయం, బిజినెస్ లైన్ పత్రిక సోమవారం ఇక్కడ నిర్వహించిన బడ్జెట్ అనంతర కార్యక్రమంలో పీయూష్ ప్రసంగించారు. జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్.డి.ఏ) ప్రభుత్వం ఎప్పుడూ ‘‘వెనుకజరిగిన వాటిపై’’ దృష్టిపెట్టి ఉంచుతుందనే విమర్శలను కేంద్ర మంత్రి పీయూష్ గోయుల్ తిప్పికొట్టారు. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ముఖ్యంగా మెరుగైన కనీస మద్దతు ధరల ద్వారా ఆ పని చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు. అవసరమైతే మధ్య కాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పీయూష్ చెప్పారు. ‘‘మేం ఉష్ట్రపక్షులం కాదు. ‘నా దారి లేదా రహదారి’ మేం ఏమీ అనడం లేదు. మధ్య కాల దిద్దుబాటులకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన అన్నారు.ఇంతకుముందు ఐక్య ప్రగతిశీల కూటమి (యు.పి.ఏ) ప్రభుత్వం తీసుకున్న కొన్ని రైతు సంబంధిత చర్యలను ఆయన వివుర్శించారు. వాటిలో కొన్ని దేశం కన్నా ‘‘సంకుచిత శక్తుల స్వప్రయోజనాలు’’ ముఖ్యమని సూచించాయని ఆయన వ్యాఖ్యానించారు. వస్తువులు,సేవల పన్ను (జి.ఎస్.టి) వల్ల గత ఏడాది తలెత్తిన కొన్ని సమస్యలను మినహాయిస్తే, గత మూడున్నరేళ్ళుగా ఆర్థిక వ్యవస్థ క్రమేపీ బలం పుంజుకుంటూ వృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో, మన స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి) వృద్ధి 6.7 శాతం ఎగువనే ఉండవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అది 7.5 శాతం దాటవచ్చు. భారతదేశం ఇప్పుడు వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకోవడం సామాన్యమైన విజయం ఏమీ కాదు. ఈ ప్రయాణంలో భాగమైనందుకు ఎంతో ఉత్తేజంగా ఉంది’’ అని పీయూష్ అన్నారు. ఉద్యోగాలు కోరేవారుగాకాక, ఉద్యోగాలను సృష్టించేవారుగా పరిణమించవలసిందని ఆయన విద్యార్థులను కోరారు. సమాచార సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత సేవలలో భారతీయులు తమదైన ముద్ర వేశారు. వారిని ఆదర్శంగా తీసుకుని యువత కృత్రిమ మేధ, 3డి ప్రింటింగ్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. భారతదేశం 7-8 శాతం వృద్ధి స్థాయిలకు తిరిగి చేరుకుంటోందనే సందేశాన్ని కేంద్రం దృఢంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఫిక్కీ ఉన్నత కార్యదర్శి సంజయ బారు అన్నారు. బిజినెస్ లైన్ ఎడిటర్ రాఘవన్ శ్రీనివాసన్ ఈ కార్యక్రమానికి సమన్వయుకర్తగా వ్యవహరించారు.