YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వర్షాభావం..పెనుభారం.

వర్షాభావం..పెనుభారం.
వర్షాభావ పరిస్థితి కర్నూలు వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే సాగు విస్తీర్ణం తగ్గడంతో పంట దిగుబడులూ క్షీణించిన దుస్థితి. ఖరీఫ్‌ సీజన్ లో ఆశించిన వర్షపాతం లేకపోవడంతో సాగు జరగలేదు. కష్టనష్టాలకోర్చి రైతులు సాగుచేసిన ప్రాంతాల్లో పంటలు కొంత దెబ్బ తిన్నాయి. కనీసం రబీ సీజనైనా ఆదుకుంటుందనుకున్నారు కర్షకులు. కానీ వరణుడు నిరాశనే మిగిల్చాడు. నీటి లభ్యత తగ్గిపోవడంతో పంటల సాగు 50 శాతానికి మించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో రబీ సాధారణ సాగు 3.39 లక్షల హెక్టార్లు. కానీ ఈ యేడాది కేవలం 1.77 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు రైతులు. గత యేడాది వర్షాభావ పరిస్థితులున్నా 2.20 లక్షల హెక్టార్లలో సాగు ఉండేది. ఈ యేడాది రబీ సీజన్‌లో 50 శాతం పొలాల్లో పంటలు లేకపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితి. రబీలో పప్పుశనగ ప్రధాన పంట కాగా జొన్న, వరి, వేరుశనగ, మినుము, మొక్కజొన్నలు కూడా విస్తారంగా సాగు చేస్తారు. పప్పు శనగ 1.82 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా కేవలం 99 వేల హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది. గత యేడాది పప్పుశనగ 1.61 లక్షల హెక్టార్లలో సాగు జరగగా, ఈ యేడాది సగం కూడా లేని పరిస్థితి ఉంది. 
జిల్లాలో జొన్న సాగు కూడా ఎక్కువే. అయితే 54 వేల హెక్టార్లకు 47 వేల హెక్టార్లలో మాత్రమే ఈ పంట సాగయింది. రబీలో జొన్న సాగు జరిగినప్పటికీ సాగునీటి లభ్యత తక్కువగా ఉండడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ యేడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ శ్రీశైలం, తుంగభద్ర డ్యాంలకు భారీ ఎత్తున వరద వచ్చినా అధికారులకు ముందు చూపు లేని కారణంగా నీళ్లన్నీ శ్రీశైలం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కోసం దిగువకు వదిలేశారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో పంట కాల్వల కింద రెండో పంటకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. 27,500 హెక్టార్ల సాధారణ సాగుకు గాను, ప్రస్తుతం వరి కేవలం 3 వేల హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది. మినుము, వేరుశనగ, మొక్కజొన్న పంటల సాగు విస్తీర్ణం క్షీణించిపోయింది. అరకొర వర్షాలకు పల ప్రాంతాల్లో శనగపంట దెబ్బతింది. ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని కేవలం ఖరీఫ్‌ పంటలకే పరిమితం చేయడం పట్ల రబీ రైతాంగం ఆందోళన చెందుతోంది. రబీలో దెబ్బ తిన్న పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

Related Posts