మత్స్యకారులు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కృష్ణానదిని మత్స్య సంపదకు నెలవుగా మలచుతోంది. ప్రధానంగా అనుపు ప్రాంతంలో చేపల పెంపకానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రదేశంలో లభించే చేపల ద్వారా పలువురు మత్స్యకారులు ఆర్ధికంగా ప్రయోజనాలు పొందగలుగుతున్నారు. శ్రీశైలం-నాగార్జునసాగర్ మధ్య 100 కి.మీ మేర కృష్ణానదిలో చేపలవేటకు అవకాశం ఉంది. ఇక్కడ 3వేల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి ఆస్తిగా మారిందని సంబంధిత అధికారులు చెప్తున్నారు. సాగర్‌లో ఏపీవైపు అధికారికంగా సుమారు 800మంది లైసెన్స్‌డ్ మత్స్యకారులు ఉన్నారు. అనధికారికంగా 2500మంది వరకూ చేపలు పడుతుంటారు. వీరంతా నదీ తీరం వెంట చేపలు పట్టి జీవనం సాగిస్తుంటారు. సాగర్ పర్యటనలో తమజీవనోపాధికి చేపపిల్లలను విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలని బడుగు జాలర్లు స్థానిక నేతలకు విజ్ఞప్తిచేశారు. ఈ విజ్ఞప్తిన్ని నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
ప్రభుత్వ చొరవతో మూడేళ్లుగా ఇక్కడి జలాల్లో చేపలు విడుదల చేస్తున్నారు. మూడేళ్లకాలంలో 3 కోట్ల చేపపిల్లలను విడిచిపెట్టినట్లు అంచనా. ఇలా విడిచిపెట్టిన చేపపిల్లల్లో సగం వరకు బతికినా వాటివలన వచ్చే ఆదాయం పెద్దమొత్తంలోనే ఉంటుందని సంబంధిత విభాగం అధికారులు అంటున్నారు. చేపలు పట్టిన తర్వాత, వారి వద్ద వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని దీంతో మత్స్యకారులకు చెప్పుకోతగ్గ ఆదాయమే లభిస్తోందని చెప్తున్నారు. దాదాపు రూ.150కోట్ల ఆదాయం దక్కిందని అంటున్నారు. కేజీ చేపలు రూ.60 చొప్పున లెక్క వేసినా కోటి పిల్లల వల్ల రూ.60 కోట్లు ఆదాయం సమకూరుతుంది. దీని ప్రకారం 3 కోట్ల పిల్లల్లో సగానికి లెక్క గడితే సుమారు రూ.150 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని అంచనా. కృష్ణానదిలో విడిచిపెట్టే చేపపిల్లలు ఏపీ, తెలంగాణల్లోని మత్స్యకారులకు ఆర్ధికంగా దన్నుగా నిలుస్తున్నాయి. మత్స్యకారులకు మద్దతుగా ప్రభుత్వం సాగర్ జలాల్లో చేప పిలల్లను విడుదల చేస్తుండడాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. మత్స్యకారులు కూడా హర్షం వ్యక్తంచేస్తున్నారు.