YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ప్రేమికుల దినోత్సవం..

ప్రేమికుల దినోత్సవం..

కొత్తగా ప్రేమ ఊసులు చెప్పుకుంటున్న యువతీ యువకులతో పాటు ఇప్పటికే ప్రేమలో ఉన్న జంటలు, వివాహం నిశ్చయమైన వారు, కొత్తగా పెళ్లైన వారితో పాటు తమ భాగస్వామిపై ప్రేమను వ్యక్తం చేసేందుకూ ఫ్రిబవరీ 14 వ తేదీని సద్వినియోగం చేసుకుంటున్నారు.తమ సన్నిహితులపై ప్రేమను వ్యక్తం చేసేందుకు బహుమతిని ఇవ్వడం అత్యధికులు చేసే పని. ఇందుకోసం అత్యధికులు పుష్పగుచ్ఛాలు, చాకొలెట్లు, చిన్నపాటి బహుమతులు కొనుగోలు చేస్తుంటారు. రెస్టారెంట్లు, హోటళ్లలో ఆతిథ్యం ఇచ్చేవారి సంఖ్యా అధికమే. వీరిలో పెళ్లైన జంటలు ఎక్కువ. ఈ సందర్భంగా చాలా వరకు విహారయాత్రలలో గడుపుతుంటారు.


ప్రేమలో ఉన్న యువతీ యువకులు సగటున ఈరోజు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు వెచ్చిస్తారన్నది సంస్థల అంచనా. దాదాపు అంతా యువతే కనుక, సెల్‌ఫోన్లు, లాకెట్‌ వంటి చిన్నపాటి బంగారు ఉత్పత్తులు, ముత్యాల హారాల వంటివీ బహుమతిగా ఇస్తున్నారు. తమ ప్రత్యేకత చూపాలనుకునే వారి కోసం గులాబీలపై పేర్లు, నిన్ను ప్రేమిస్తున్నాననే భావనలనూ ముద్రించి ఇచ్చే పోర్టళ్లూ ఉన్నాయి. బహుమతులు తప్పనిసరిగా ఇచ్చి తీరాలనే భావన 16-24 ఏళ్ల వారిలో అధికంగా ఉంటుంది కనుక వీరిని ఆకట్టుకునేలా ఉత్పత్తులను సంస్థలు తీర్చిదిద్దుతున్నాయి.


అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పోటాపోటీ 
ఆన్‌లైన్‌లో అయితే ఆఫర్లు అధికంగా లభిస్తాయనే భావనలో యువత ఉన్నారు. ఇందుకు తగ్గట్లే వివిధ రకాల ఉత్పత్తుల గరిష్ఠ విక్రయ ధరలపై 70-80 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు ఆన్‌లైన్‌ దిగ్గజ పోర్టళ్లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటనలు ఇస్తున్నాయి. చాకొలెట్లు, పుష్పగుచ్ఛాలు, ముత్యాలహారాలు, కళ్లజోళ్లు, వాచీలు, సెల్‌ఫోన్లు..అన్నింటిపై భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపాయి. ‘ఫ్లిప్‌హర్డ్‌డే’ పేరిట 14న వినూత్న ఆఫర్లు ఇస్తామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోళ్లపై షరతులు వర్తించేలా, 14 శాతం రాయితీ ఇస్తామని తెలిపింది. అందుబాటు ధర స్మార్ట్‌ఫోన్‌ విపణిలో అగ్రస్థానం దక్కించుకున్న షియామీ, సరికొత్త ఫోన్‌ ఎంఐ 5ను నేడు ఆవిష్కరించనుంది. ఎంఐ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ లభించనుంది. ప్రతి గంటలో అత్యధికంగా కొనుగోలు చేసేవారికి రూ.5000 గిఫ్ట్‌ఓచర్‌ ఇస్తామనీ తెలిపింది.  మోటో ఫోన్లపై అమెజాన్‌ అధిక ఆఫర్లు ప్రకటించింది.

యాపిల్‌ రూ.7-10 వేల ఆఫర్‌ 
హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌/క్రెడిట్‌కార్డులతో నెలవారీ సులభ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసుకుంటే, ఐఫోన్‌ 6, ఎస్‌ఈ మోడళ్లను రూ.7,000; ఐప్యాడ్‌, ఐప్యాడ్‌ మినీ 4, ఐప్యాడ్‌ ప్రోలపై రూ.10,000 నగదు వెనక్కి ఇస్తామని యాపిల్‌ సంస్థ ప్రకటించింది. విక్రయశాలల్లో ఈ ఆఫర్‌ అమలవుతోంది. 
శామ్‌సంగ్‌ కూడా గెలాక్సీ ఎస్‌7, ఎస్‌ 7ఎడ్జ్‌ వంటి అధిక ధర మోడళ్లతో పాటు అందుబాటు ధరలో ఉండే ఆన్‌ నెక్ట్స్‌ మోడళ్ల ధరలనూ తగ్గించింది. వడ్డీలేని సులభవాయిదాల్లో కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది.

30% ఆర్థిక సంస్థల రుణాలపైనే.. 
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లకు బజాజ్‌ఫైనాన్స్‌ వంటి ఆర్థిక సంస్థలు రుణాలిస్తున్నాయి. మొత్తం కొనుగోళ్లలో ఇవే 30 శాతం ఉంటున్నాయని బిగ్‌సి ఛైర్మన్‌ బాలుచౌదరి తెలిపారు. రూ.5-8 వేల రూపాయల ఫోన్‌ కొందామని వచ్చేవారు కూడా, నెలవారీ సులభ వాయిదాల వల్ల రూ.10-15 వేల ఫోన్‌ కొంటున్నారని వివరించారు. తమ విక్రయశాలల్లోనూ కంపెనీలు ఇచ్చే ఆఫర్లు అమలవుతున్నాయని వివరించారు. సంగీతా మొబైల్స్‌ కూడా పాత ఐఫోన్ల మార్పిడి, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోళ్లలో ఆఫర్లు ఇస్తోంది.

విదేశాల నుంచి ఆర్డర్లూ అధికంగా.. 
ప్రేమికులు, కొత్తగా వివాహమైన జంటల్లో ఒకరు విదేశాల్లో ఉంటే, ఇక్కడి తమ సహచరి, భాగస్వామికి తప్పనిసరిగా బహుమతులు పంపుతున్నారు. వీటిల్లో గులాబీ పుష్పగుచ్ఛాలు, చిన్నపాటి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ల వంటివి అత్యధికంగా ఉంటున్నాయని, యూఎస్‌టుగుంటూర్‌ పోర్టల్‌ ఎండీ శ్రీధర్‌ తెలిపారు. తమ పేరు, లేదా ఐలవ్‌యూ వంటి భావనలు గులాబీ పూలపై రాయించి హైదరాబాద్‌, విశాఖ, గుంటూరు, విజయవాడ వంటి నగరాల్లో అయితే సరఫరా చేయగలుగుతున్నట్లు, వీటికి ఆదరణ బాగుందని తెలిపారు. ఇలాంటి సేవలు రూ.800 నుంచీ ఉన్నాయి.

Related Posts