గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ప్రత్తిపాడు. 2009లో రిజర్వుడు వర్గాలకు కేటాయించిన ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకిదిగిన ఐఆర్ ఎస్ మాజీ ఉద్యోగి రావెల కిశోర్‌బాబు విజయం సాధించారు. నిజానికి ఇక్కడ వైఎస్‌కు అనుకూలమైన కుటుంబం, వైసీపీ నాయకురాలు మేకతోటి సుచరిత ఉన్నప్పటికీ.. ఇక్కడ టీడీపీ హవా సాగింది. దీంతో రావెల విజయం సునాయాసంగా సాగిపోయింది. తొలి ప్రయత్నంలోనే రావెల విజయం సాధించారు. దీంతో చంద్రబాబు ఆయనకు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. ఆయన సద్వినియోగం చేసుకోకుండా పార్టీకి, ప్రభుత్వానికి కూడా మచ్చతెచ్చేలా వ్యవహరించారు. ఫలితంగా చంద్రబాబు ఆయనను మంత్రి పదవి నుంచి మౌనంగా తప్పించారు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన రావెల కొద్ది రోజులుగా టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు ఆయన పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి జనసేనలోకి చేరిపోయారు. నిజానికి ఈ పరిణామంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. అంతేకాదు, అధిష్టానానికి కూడా పెద్ద రిలీఫ్ వచ్చినట్టయింది. ప్రస్తుతం ప్రత్తిపాడు టీడీపీలో పైన చెప్పుకున్నట్టుగానే ఉంది. కట్ చేస్తే.. ఇప్పుడు టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయ కర్త పోస్టు ఖాళీ అయింది. మరో నాలుగు మాసాల్లోనే ఎన్నికలు ఉన్న దరిమిలా ఇక్కడ టీడీపీ సమన్వయ కర్తను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. అయితే, ఇది అంత ఆషామాషీగా నిర్ణయించేది కాదని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున మేకతోటి సుచరిత గట్టి పోటీ ఇస్తున్నారని, ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమని, ఈ క్రమంలో ఈమెకు సరైన ప్రత్యర్థిని వెతకాల్సిన అవసరం బాబుపై ఉందని అంటున్నారు.మహిళా సెంటిమెంట్‌కు అడ్డుకట్ట వేయడంతోపాటు ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న నాయకురాలిని రంగంలోకి దింపాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అయితే, ప్రత్తిపాడులో టీడీపీకి అన్నీ తానై వ్యవహరించిన కందూకురి వీరయ్య పేరు వినిపిస్తోంది. అయితే, ఈయనకు గతంలో చంద్రబాబు అవకాశం ఇచ్చారు. 2009, 2012(ఉప ఎన్నిక)లో అవకాశం ఇచ్చారు. అయితే, ఆయన మేకతోటి సుచరితపై ఆయన ఓడిపోయారు. దీంతో పార్టీలో చైతన్యవం తంగా ఉన్నా.. ప్రజలను మెప్పించలేని జాబితాలో ఉన్నాడనే కారణంగా ఆయనను పక్కన పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక, ఐఏఎస్ అధికారి రామాంజనేయులు పేరు కూడా ఇక్కడ పరిశీలనలో ఉన్నా.. ఆయన ఎంపీగా అయితే, ప్రభుత్వానికి ఉపయోగపడతారని అంటున్నారు చంద్రబాబు. దీంతో ఆయనకు బాపట్ల ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఎంపీగా ఉన్న మాల్యాద్రికి ప్రజల నుంచి తిరస్కారం ఎక్కువగా కనిపిస్తోంది.ఎక్కడాకనిపించడం లేదని కొన్నాళ్ల కిందట పోస్టర్లు కూడా వెలిశాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో మాల్యాద్రిని దాదాపు పక్కన పెట్టే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూచిపూడి విజయకు ఖచ్చితంగా టికెట్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈమెకు స్థానికంగా పట్టు ఉండడం. గతంలో జెడ్పీ చైర్మన్‌గా చేసిన అనుభవం కలగలిపి.. కూచిపూడికి ప్లస్ అవుతుందని, సో.. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఆమెకు టికెట్ కన్ఫర్మ్ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కూచిపూడి విజయ కనుక రంగంలోకి దిగితే.. సుచరితకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని ప్రత్తిపాడు పర్యవేక్షిస్తున్న టీడీపీ సీనియర్లు అంటున్నారు. ఆమెకు సీటు ఇస్తే జిల్లాలో టీడీపీ మహిళకు సీటు ఇచ్చినట్లవుతుందని కూడా జిల్లా టీడీపీలో కొందరు చెపుతున్నారు. చూడాలి మరి బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో!!