శ్రీవారి వివిధ ఆర్జిత సేవలకు సంబంధించి మార్చి నెల కోటా కింద 70,512 టికెట్లను టీటీడీ విడుదల చేసింది. వీటిలో 11,537 సేవా టిక్కెట్లు ఆన్‌లైన్ డిప్ విధానం ద్వారా కేటాయిస్తారు. ఈ టిక్కెట్ల కోసం శుక్రవారం ఉదయం 10 గంటల నుంచే పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో అత్యధికంగా సుప్రభాత సేవకు 8,182, తోమాలసేవ 120, అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 టికెట్లు ఉన్నాయి. ఇక, జనరల్ కేటగిరిలో 58,975 టికెట్లు విడుదల కాగా వీటిలో విశేషపూజ 2 వేలు, కల్యాణోత్సవం 14,725, ఊంజలసేవ 4,650, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,300, సహస్ర దీపాలంకరణ సేవ 15,600 వంతున అందుబాటులోకి ఉన్నట్టు వెల్లడించారు. ఆన్‌లైన్ డిప్ కోసం డిసెంబరు 11 మధ్యాహ్నం 12 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టిక్కెట్లను కేటాయిస్తారు. టికెట్లు లభించిన భక్తులు డిసెంబరు 14 మధ్యాహ్నం 12 గంటల్లోపు నగదు చెల్లించాలి. శ్రీవారి సేవా టికెట్ల కేటాయింపులో టీటీడీ కీలక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పాత విధానంలోని లోపాలను అక్రమార్కులు తమకు అనుకూలంగా మలచుకుని అక్రమాలకు పాల్పడటంతో టీటీడీ కొత్త నిబంధనలు రూపొందించింది. విజిలెన్స్ విభాగం సిఫార్సుల మేరకు రూపొందించిన తాజా నిబంధనలు నవంబర్ నెలలో విడుదల చేసిన సేవా టికెట్లకు వర్తింపజేసింది. కొత్త నిబంధన ప్రకారం.. ఒక మెయిల్ ఐడీ, ఒక ఫోన్ నెంబరుతో మాత్రమే బుక్ చేసుకోవాలి. గతంలో ఈ విధానం లేకపోవడంతో వందలాది నకిలీ ఐడీలతో పేరు నమోదు చేసుకోవడం, ఎలక్ట్రానిక్ లాటరీ విధానంలో టిక్కెట్లు దక్కించుకుని, వాటిని ఇతరులకు అమ్ముకొని సొమ్ము చేసుకోవడం తెలిసిందే.