- శుక్రవారం చివరిదైన ఆరో వన్డే
దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి ఓ సిరీస్‌ను చేజిక్కించుకుంది. పేలవ ఫామ్ నుంచి బయటపడ్డ రోహిత్ శర్మ (115; 126 బంతుల్లో 11×4, 4×6) సెంచరీతో మెరిసిన వేళ.. మంగళవారం జరిగిన ఐదో వన్డేలో కోహ్లీసేన 73 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఆఖర్లో తడబాటుతో అనుకున్నన్ని పరుగులు చేయకపోయినా.. ఫీల్డింగ్‌లో పొరపాట్లు చేసినా.. చక్కని బౌలింగ్‌తో ఆతిథ్య జట్టును భారత్ చుట్టేసింది. రోహిత్ మెరవడంతో మొదట భారత్ 7 వికెట్లకు 274 పరుగులు సాధించింది. ఛేదనలో హషీమ్ ఆమ్లా (71; 92 బంతుల్లో 5×4) పోరాడినా దక్షిణాఫ్రికాకు ఫలితం లేకపోయింది. పాండ్య (2/30), చాహల్ (2/43), కుల్‌దీప్ (4/57) విజృంభించడంతో ఆ జట్టు 42.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 4-1తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. ఐదు వన్డేల్లో 30 వికెట్లు తీసిన మణికట్టు స్పిన్ ద్వయం కుల్‌దీప్, చాహల్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.ఏ ఫార్మాట్లోనైనా దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ గెలవడం టీమ్ ఇండియాకు ఇదే తొలిసారి. చివరిదైన ఆరో వన్డే శుక్రవారం సెంచూరియన్‌లో జరుగుతుంది.
పాతికేళ్ల నిరీక్షణ ఫలించిన వేళ..
1992 నవంబరు మొదలు.. పాతికేళ్లుగా సఫారీ గడ్డకు వెళ్తోంది వస్తోంది టీమ్‌ఇండియా. ఏడు టెస్టు సిరీస్‌లయ్యాయి. ఏడు వన్డే సిరీస్‌లు ముగిశాయి. ఎన్నడూ ఏ ఫార్మాట్లోనూ భారత్ సిరీస్ విజేతగా నిలిచింది లేదు. అయితే ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కోహ్లీసేన కల నెరవేర్చింది. దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం సాధించిన తొలి భారత జట్టుగా నిలిచింది. ఆరు వన్డేల పోరులో తొలి మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ విజయానికి చేరువగా వచ్చిన భారత్‌కు నాలుగో వన్డేలో ఎదురుదెబ్బ తగిలినా.. తర్వాతి మ్యాచ్‌లో గట్టిగానే పుంజుకుంది. ఐదో వన్డేలో ఆతిథ్య జట్టును 73 పరుగుల తేడాతో ఓడించి, మరో మ్యాచ్ మిగిలుండగానే 4-1తో సిరీస్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానం కూడా పదిలమైంది. తర్వాతి మ్యాచ్ ఓడినా నంబర్‌వన్ కొనసాగుతుంది.