వైసీపీలో నాయకుల మధ్యన సఖ్యత లేకపోవడం ముఠాల కుమ్ములాటల ఫలితాలను పార్టీ అనుభవించాల్సివస్తోందని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
పార్టీని నడిపించేందుకు గతంలో జగన్ అనేక అసెంబ్లీ సీట్లకు ఇంచార్జులను నియామకం చేశారు. ఆయితే జిల్లా అధ్యక్షుడు, ఇతర బాధ్యులు అప్పట్లో తమకు కావాల్సిన వారిని, కులాభిమానంతో ఇతర కారణాలతో ఎంపిక చేసి ఆ లిస్ట్ ను అధినాయకత్వం నుంచి ఆమోదించుకున్నారు. అలా నియామకం చేయబడిన వారంతా తాము కాబోయే ఎమ్మెల్యేలమని భావిస్తూ వచ్చారు. అయితే ఎన్నికల సమయానికి పోటీలో గట్టిగా నిలబడే వారినే ఎంపిక చేయాలన్న ఆలోచనలకు అనుగుణంగా జగన్ ఈ మధ్యన విశాఖ జిల్లాలో పలువురుని మార్చి కొత్తగా ఇంచార్జులను నియమించారు. ఆ సమయంలో ప్రస్తుత ఇంచార్జులను కూడా సంప్రదించి పార్టీ అధికారంలోకి వస్తే తగిన న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారని చెబుతున్నారు.పార్టీలో దిగువ స్థాయి నియామకాల విషయంలో నాయకులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు చివరకు చేటు తెస్తున్నాయని అంటున్నారు. జగన్ ఆదేశాలపై నియోజకవర్గాల ఇంచార్జుల నియామకాల విషయంలో నేతలు చేసిన తప్పుకు ఇపుడు పార్టీ కొంప ముంచుతున్నాయి. ఏ మాత్రం అర్హత లేని వారిని నియోజకవర్గం ఇంచార్జిలుగా రికమెండ్ చేసిన పాపానికి నేడు పార్టీ పరిహారం భరించాల్సివస్తోందని అంటున్నారు.అయితే తమ స్థాయిని ఎక్కువగా ఊహించుకున్న మాజీ ఇంచార్జులు మాత్రం పార్టీలో ఉంటున్నా అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడం, ఇతర పార్టీల్లోకి మారేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది. అలా వైసీపీ నుంచి జనసేనలోకి ఇటీవల ఓ మహిళా నాయకురాలు మారిపోయారు. ఆమె వార్డు కార్పోరేటర్ స్థాయి నేత అని, ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే ఎలా అని పార్టీలోని వారే అంటున్నారు. మరి అటువంటి నేతను ఏకంగా ఇంచార్జిగా నియామకం చేయడం జిల్లా పార్టీ పెద్దలు చేసిన తప్పు అని కూడా అంటున్నారు.ఇలాంటి నాయకుల వల్ల వైసీపీకి ఇపుడు చెడ్డ పేరు వస్తోందని, వారు పార్టీ మారుతూ చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోవడం పార్టీ వంతు అవుతోందని కూడా అంటున్నారు. నాలుగేళ్ళ పాటు జిల్లాలో పార్టీ పడకేయడానికి కొంతమంది వైసీపీ జిల్లా నాయకులే కారణమని కూడా అంటున్నారు. ఈ తరహా నాయకులను పక్కన పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ఎంతటి ప్రజాభిమానం ఉన్నా పార్టీకి ఇబ్బందులు తప్పవని కూడా అంటున్నారు